చుట్టూ ఇండ్లు, పక్కనే మెయిన్ రోడ్.. .. ఆమెను చంపి నిప్పంటించారు!
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలన ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని ఓ మహిళపై పెట్రోల్ పోసి తగలబెట్టి దారుణంగా హత్య చేశారు. శంషాబాద్‌లోని సైబరాబాద్ జోన్ డీసీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఓ మహిళను అర్థరాత్రి అతి దారుణంగా హత్య చేయడం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. శంషాబాద్ పరిధిలోని శ్రీనివాస కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలనీలో చుట్టూ ఇండ్లు, పక్కనే ప్రధాన రహదారి, ఎప్పుడు పోలీస్ ఐరన్లతో మారుమోగే రహదారి పక్కనే మహిళను కిరాతకంగా హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించి.. శంషాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస ఎన్ క్లేవ్ కాలనీలో మహిళాపై పెట్రోల్ పోసి తగలబెట్టారని అర్థరాత్రి 1 గంటల తర్వాత స్థానికులు డయల్ 100 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే మహిళ మంటలో పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నామని.. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నమని తెలిపారు.
గురువారం రాత్రి ఒక వ్యక్తి బైక్‌పై వ్యక్తి వచ్చి రాత్రి 11:30 గంటల సమయంలో ఆ మహిళను పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు ఆనవాళ్లు గుర్తించినట్లు తెలిపారు. మృతురాలు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉంటుదన్నారు. ఇండ్ల మధ్య మహిళను హత్య చేసి తగలబెట్టడంతో ఎవరు ఊహించలేదని.. ఎవరో చెత్త తగలబెట్టారని అనుకొని స్థానికులు ఎవరూ పట్టించుకోలేదన్నారు. నిందితుల కొరకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నామని అన్నారు.