Women Govt Jobs : ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు హారిజాంటల్‌ రిజర్వేషన్లు

Update: 2024-02-09 02:23 GMT

సర్కారు కొలువులకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్‌ పాయింట్‌ను మార్కు చేయకుండా ఓపెన్‌, రిజర్వుడు కేటగిరీల్లో 100లో 33 శాతం(1/3) రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.గతంలో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు... ప్రస్తుత గవర్నమెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్‌కు సంబంధించిన నియామక ప్రక్రియలో దీనిని అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు నిబంధనలు-1996 ప్రకారం మహిళలకు ఓపెన్, రిజర్వ్డ్ కేటగిరిల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే నిబంధన ఉంది.గ్రూప్‌ – 1 ఉద్యోగ ప్రకటనలో రోస్టర్‌ పాయింట్‌ 1 నుంచి తీసుకోవడంతో మహిళలకు ఎక్కువ పోస్టులు రిజర్వు అయ్యాయి. దీన్ని సవాల్‌ చేస్తూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వర్సెస్‌ రాజేష్‌ కుమార్‌ దరియా కేసులో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

దీంతో టీఎస్‌పీఎస్సీ నియామకాల్లో హారిజాంటల్‌ రిజర్వేషన్లు అమలుచేయాలని 2022 డిసెంబర్‌ 2న మెమో జారీ చేసింది. ప్రస్తుతం.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి టీఎస్‌పీఎస్సీతోపాటు ఇతర విభాగాధిపతులు అందరూ మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ మేరకు రిజర్వేషన్ల అమలుపై కోర్టులో న్యాయ వివాదం ముగిసింది. దీంతో గురుకుల టీచర్ పోస్టుల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. గురుకులం పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ జాబితాలను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌ లో అభ్యర్ధులు తమ వివరాలు నమోదు చేసి మెరిట్‌ జాబితాను చెక్‌ చేసుకోవచ్చు. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకిగానూ గతేడాది ఒకేసారి 9 నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల కోసం దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది ఆగస్టు నెలలో నెలరోజుల పాటు ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత వెనువెంటనే ప్రాథమిక, తుది ఆన్సర్‌ ‘కీ’లను బోర్డు వెల్లడించింది. అప్పుడే ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా సమాంతర రిజర్వేషన్లపై కోర్టులో న్యాయ వివాదం నమోదైంది. దీంతో కొంత కాలయాపన జరిగింది. మంగళవారంతో కోర్టు వివాదం ముగిసింది. సంక్షేమ గురుకులాల సొసైటీ పరిధిలోని డిగ్రీ, జూనియర్‌ కాలేజీలు, పాఠశాలల్లో లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్ల పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 1 : 2 నిష్పత్తితో జాబితాను ప్రకటించింది.

Tags:    

Similar News