గృహలక్ష్మి పథకం కొనసాగించాలంటూ మహిళల ధర్నా

Update: 2024-01-12 12:37 GMT

గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట ఎమ్మార్వో కార్యాలయం ముందు కొందరు మహిళలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు గృహలక్ష్మి కింద ఇళ్లు మంజూరు చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేసిందని అన్నారు. గృహలక్ష్మి పథకాన్ని కొనసాగించి తాము ఇళ్లు కట్టుకునేందుకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా ఇటీవల కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసింది. దాని స్థానంలో అభయహస్తం కింద రూ.5 లక్షల వ్యయంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు కట్టిచ్చి ఇస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆరు గ్యారెంటీల అమలకు కోసం ప్రజా పాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించింది. ప్రస్తుతం ఆ దరఖాస్తులకు సంబంధించిన డేటా ఎంట్రీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 17 వరకు డేటా ఎంట్రీ పూర్తి చేసి నెలాఖరు లోగా అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు. కాగా గత ప్రభుత్వం గృహలక్ష్మి పేరుతో రూ.3 లక్షల వ్యయంతో ఇండ్లు నిర్మించేందుకు జీవో జారీ చేసింది. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో లబ్దిదారుల ఎంపిక కూడా పూర్తైంది. కానీ ఈ లోపే ప్రభుత్వం మారడం.. గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేయడంతో లబ్దిదారులు పలు చోట్లు ఆందోళనకు దిగుతున్నారు.




Tags:    

Similar News