పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అంటారు. కొందరు బతకడానికి తింటే కొందరు తినడానికే బతుకుతుంటారు. తినడంలోనూ హోదాను బట్టి నానా వైవిధ్యాలు. కొందరు గంజినీళ్లతో సరిపెట్టుకుంటే కొందరికి ముప్పూటలా ఫాస్ట్ పడితేగాని కడుపు నిండదు. డబ్బున్నోళ్ల సంగతి చెప్పక్కర్లేదు. తినాలేగాని కొండమీద కోతిని కూడా నెయ్యితో ఫ్రైచేసి పెడతారు! అంత అఘాయిత్యం కాకపోయినా ఇటీవల తినే తిండికి బంగారం, వెండి జోడించడం మామూలైపోయింది. ఒకప్పుడు స్వీట్లకు, తాంబూలాలకు మాత్రమే పరిమితమై ఈ స్టైల్ ఇప్పుడు రోజువారీ తిండికి కూడా జతైంది. బండారు, వెండి రేకుల (ఫాయిల్స్)తో భోజనాన్ని వడ్డించే ట్రెండ్ తెలుగు రాష్ర్టాల్లోనూ మొదలైంది. ఇందులో భాగంగా బంగారు ఇడ్లీలు కూడా వచ్చేశాయ్!
24 కేరట్ల స్వచ్ఛమైన బంగారాన్ని ఇడ్లీలకు జతచేసి అందిస్తున్నారు. బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని కృష్ణ ఇడ్లీ కఫే సెంటర్ ఈ గోల్డ్ ఇడ్లీలను వడ్డిస్తోంది. రెండు ఇడ్లీల ధర కేవలం రూ. 1200లే అట! వీటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మామూలు ఇడ్లీలపై చీజ్ వేసి తర్వాత గోల్డ్ ఫాయిల్ పెడతారు. జీడిపప్పు, కొత్తిమీర ఎగస్ట్రా టచ్. సాంబారు, చట్నీ, చిట్లం పొడి కామన్. ప్రపంచంలో ఇదే తొలి గోల్డ్ ఇడ్లీ అని ప్రచారం చేస్తున్నారు.