MLA HariPriya: హైదరాబాద్కు అసమ్మతి నేతలు.. హరిప్రియకు బీఫాం ఇవ్వొద్దని డిమాండ్..

By :  Kiran
Update: 2023-09-30 07:20 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్లో మరోసారి అంసతృప్తి చల్లారడం లేదు. ఇల్లందు ఎమ్మెల్యే టికెట్ ను హరిప్రియ నాయక్కు ఇవ్వడాన్ని స్థానిక నేతల్లో కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమెను తప్ప ఎవరిని బరిలో నిలిపినా పనిచేస్తామని అసమ్మతి నేతలు తెగేసి చెబుతున్నారు. హరిప్రియకు బీఫాం ఇవ్వొద్దని కోరుతూ అధికార పార్టీ లీడర్లు, ప్రజాప్రతినిధులు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన దాదాపు 100 నాయకులు హైదరాబాద్ చేరుకున్నారు. వారంతా మంత్రి హరీష్ రావును కలిసి నియోజకవర్గంలో పరిస్థితిని వివరించినట్లు సమాచారం. పార్టీ వర్కింగ్ ​ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శనివారం ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో అక్కడి నేతలు రాజధానికి రావడం చర్చనీయాంశమైంది.

ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరిసింగ్ ​పెత్తనం రోజురోజుకు ఎక్కువ అవుతోందని, స్థానిక నాయకులను కలుపుకుపోవడం లేదని అసమ్మతి నేతలు కొంతకాలంగా వాపోతున్నారు. ఈ క్రమంలో హరిప్రియకు బీఫాం ఇస్తే తాము పని చేయలేమని, ఆమెకు తప్ప ఇంకెవరికి ఇచ్చినా కష్టపడి పనిచేస్తామని హైకమాండ్ కు తెగేసి చెబుతున్నారు. బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ ప్రకటించకముందే నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు పార్టీ పెద్దలను అభ్యర్థించారు. అయినా ఆమెకే టికెట్ కేటాయించడంతో వ్యవహారం మరింత ముదిరింది. ఇటీవల హరిప్రియ మంత్రి హరీశ్ రావును కలిసి అసమ్మతి నేతలపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వారంతా ఆయనను కలిసేందుకు హైదరాబాద్కు రావడం హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News