వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు

Update: 2023-06-05 08:39 GMT



వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. పోలీసులపై దాడి కేసులో ఈ నెల(జూన్) 20న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 24న నిరుద్యోగ సమస్యలపై దీక్షకు సిద్ధమైన ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో.. వారితో వాగ్వానికి దిగారు షర్మిల. తనను ఎందుకు ఆపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో చివరికి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ క్రమంలో బందోబస్తులో ఉన్న పోలీసులపై ఆమె చేయి చేసుకున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఏప్రిల్ 24న(దాడి జరిగిన రోజే) షర్మిలను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచగా ఆమెకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఏప్రిల్ 25న నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. పోలీసులపై దాడి చేసిన కేసుపై విచారణచేపట్టిన పోలీసులు.. నేడు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. దీంతో విచారణకు హాజరుకావాలంటూ షర్మిలకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.

గత కొంతకాలంగా వైఎస్ షర్మిల అధికార పార్టీ బీఆర్ఎస్ పై పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. ఇటీవల తెలంగాణాలో సంచలనం రేపిన పేపర్ లీకేజి అంశంపై వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న దశాబ్ది ఉత్సవాలపై కూడా ఆమె మండిపడుతున్నారు. ఏం సాధించారని దశాబ్ది వేడుకలు జరుపుతున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు .




Tags:    

Similar News