KCR.. అసెంబ్లీ అంటే ఎందుకంత భయం - YS Sharmila

Update: 2023-08-04 12:41 GMT

సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రికి అసెంబ్లీ అంటే ఎందుకు భయమని ప్రశ్నించారు. ప్రజా సమస్యల మీద చర్చించే దమ్ము లేదా అంటూ నిలదీశారు. మూడొద్దులు అసెంబ్లీ పెట్టి, మీడియాలో మురిపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆమె ట్వీట్ చేశారు.

ఎన్నికల ముందే గడీల్లోంచి బయటకు వచ్చిన దొర గారు.. అసెంబ్లీ సెషన్స్లోనూ జనాలకు కనిపించడా? అని షర్మిల ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల గడువు పొడిగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ రెండు దఫాల మేనిఫెస్టోపై, ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చ జరగాలని, కేసీఆర్ డబుల్ టర్మ్ కి ఇదే ఆఖరి సెషన్ అని జోస్యం చెప్పారు. కేసీఆర్ నిజంగా తెలంగాణ ప్రజల మేలుకోరే వారైతే.. ఆయన పాలన మీద ఆయనకు నమ్మకం ఉంటే, ఈ ఆఖరి సెషన్ లోనైనా మేనిఫెస్టో మీద తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిల సవాల్ విసిరారు.

కేసీఆర్ పాలనకు ఇది రెఫరండమని నిరూపించుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. నియంతలా పాలించడం, దోచుకోవడం తప్ప సీఎంకు ఏం చేతకాదని అన్నారు. బీఆర్ఎస్ అంటే బంది పోట్ల రాష్ట్ర సమితి అన్న షర్మిల ఎన్నికలప్పుడు బయటకురావడం కాదు.. తొమ్మిదేండ్లలో ఇచ్చిన హామీలపై కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి ఎందుకివ్వలేదో చెప్పాలని నిలదీశారు. ఉచిత ఎరువులు, కేజీ టు పీజీ ఉచిత విద్య, నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు ఏమయ్యాయో నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమిపై సమాధానం చెప్పాలని.. ఎస్సీలకు కేటాయిస్తామన్న రూ.50వేల కోట్ల నిధులపై చర్చ జరపాలని అన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్ నోరు తెరవాలని, అమరుల కుటుంబాలకు ఏం మేలు చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. బంది పోట్ల రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఎన్నికల కుంభకర్ణుడు చంద్రశేఖరుడికి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా? అని షర్మిల నిలదీశారు.



Tags:    

Similar News