Zomato: పెట్రోల్ కష్టాలు.. ఫుడ్ డెలివరీ బాయ్ స్మార్ట్ ఐడియా

Update: 2024-01-03 03:18 GMT

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హిట్‌ అండ్‌ రన్‌ చట్టాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్‌లో వాహనదారులకు చుక్కలు కనిపించాయి. ధర్నా వల్ల పెట్రోల్‌ కొరత ఏర్పడుతుందని భావించిన వాహనదారులు ఒక్కసారిగా బంకులకు క్యూ కట్టారు. భారీ క్యూ లైన్ల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరీ ముఖ్యంగా రోజూ ఉద్యోగానికి వెళ్లే వారు, ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ పెట్రోల్‌ కోసం గంటల తరబడి బంకుల వద్ద నిల్చునే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో ఓ యువకుడు చేసిన వినూత్న ఆలోచన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

హైదరాబాద్ లోని చంచల్‌గూడలో ఓ డెలివరీ బాయ్ ఏకంగా గుర్రంపై స్వారీ చేస్తూ.. ఫుడ్ డెలివరీ చేయడానికి బయల్దేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వైపు పెట్రోల్‌ బంకుల దగ్గర భారీ క్యూలైన్.. మరొకొన్ని చోట్ల నో స్టాక్‌ బోర్డులతో గత్యంతరం లేక గుర్రాలపై పార్సిల్స్‌ను డెలివరీ చేసినట్లు జొమాటోకు చెందిన ఓ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ చెప్పుకొచ్చాడు. గుర్రంపై ఫుడ్‌ డెలివరీ చేస్తున్న సదరు వ్యక్తిని అందరూ ఆశ్చర్యంగా చూశారు. తమ స్మార్ట్‌ ఫోన్స్‌లో వీడియోలు చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. మరో పక్క ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసిన డెలివరి బాయ్స్ మాత్రం ఏం చక్కా రోడ్లపై తమ వాహనాలతో ఫుడ్ డెలివరి కోసం రయ్‌ మని తీశారు.

కాగా రాత్రి కేంద్ర ప్రభుత్వం డ్రైవర్ల అసోసియేషన్ తో జరిపిన చర్చలు విజయవంతం కావడంతో డ్రైవర్లు నిరసనను విరమించుకుని ట్యాంకర్లతో ఆయిల్ కంపెనీలకు చేరుకున్నారు. ఈరోజు తెల్లవారుజాము కల్లా నగరంలోని అన్ని బంకులకు ట్యాంకర్లు ఫుల్ లోడ్ తో చేరాయి. దీంతో రాత్రిపో పోల్చుకుంటే.. పెట్రోల్ బంకుల వద్ద ప్రస్తుత పరిస్థితులు నిలకడగా ఉన్నాయి.

Full View




Tags:    

Similar News