Ponnam Prabhakar : హైదరాబాద్లో 80 కొత్త బస్సులు.. నేడే ప్రారంభం
ఆర్టీసీ కొత్తగా 80 బస్సులు అందుబాటులోకి తీసుకురానుంది. ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం ఈ బస్సులను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ సమీపంలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం జరగనుంది. కొత్తగా ప్రవేశపెట్టనున్న 80 బస్సుల్లో 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ నాన్ ఏసీ బస్సులు ఉన్నాయి.
మహిళలకు ఫ్రీ జర్నీ స్కీంం వల్ల బస్సుల్లో భారీగా రద్దీ పెరిగింది. దీంతో ఈ కొత్త బస్సులను తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.400 కోట్లతో 1,050 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 రాజధాని ఏసీ బస్సులున్నాయి. వీటితో పాటు పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, ఇతర ప్రాంతాల్లో 500 బస్సులను అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ నిర్ణయించింది. 2024 మార్చి నాటికి విడతల వారీగా కొత్త బస్సులన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ఆర్టీసీ ప్లాన్ చేసింది.