Revanth Reddy : కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం.. సీఎం ఎవరంటే..
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం మెుదలైంది. పదేళ్లుగా కనీసం ప్రతిపక్షంలో కూడా లేని కాంగ్రెస్ పార్టీ ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (60)ను దాటడమే కాకుండా మరో 4 స్థానాలను అదనంగా గెలిచింది. దీంతో సోమవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఉదయం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం తర్వాత అధిష్ఠానంతో సంప్రదించి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది గవర్నర్‌కు తెలియజేస్తారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. పీసీసీ అధ్యక్షుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఆయన పేరును ఖరారు చేసినట్లుగా సమాచారం. పార్టీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు ఈ పదవికి పోటీ పడుతున్న నేపథ్యంలో సీఎల్పీ భేటీ తర్వాతనే అధికారికంగా సీఎం అభ్యర్థి పేరు వెలువడే అవకాశం ఉంది.
ఎన్నికల్లో 65 స్థానాలను గెలుచుకొన్న కాంగ్రెస్.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సాధించింది. డిసెంబరు 9న LB స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని గతంలో పలు సందర్భాల్లో రేవంత్ ప్రకటించారు. అయితే అంతవరకు ఆగకుండా సోమవారమే చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో మకాం వేసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకురాలు దీపాదాస్ మున్షీ, ఇన్‌ఛార్జి ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లురవి తదితరులు ఆదివారం రాత్రికే ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని నిర్ణయించారు.