CM Revanth Reddy: ఆరు గ్యారంటీల ఫైల్‌పై సీఎం రేవంత్ తొలి సంతకం
తెలంగాణ ప్రజలకు ఇవాళే స్వేచ్ఛ వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆషామాషీగా ఏర్పడ్డ రాష్ట్రం కాదని, పోరాటాలతో, త్యాగాలే పునాదులుగా ఏర్పడ్డ రాష్ట్రమని అన్నారు. ‘‘ పదేళ్లుగా నిరంకుశత్వాన్ని ప్రజలు మౌనంగా భరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇప్పటికే ప్రగతిభవన్ ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించాం. సంక్షేం, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చుదిద్దుతాం. శుక్రవారం ఉదయం జ్యోతిరావుపూలే ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తాం. మీ బిడ్డగా.. మీ సోదరుడిగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తాను" అని చెప్పారు.
తెలంగాణకు పట్టిన చీడ పోయిందని, ఇకపై రాష్ట్ర కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా ప్రజా భవన్ కు రావొచ్చని చెప్పారు రేవంత్ రెడ్డి. రాష్ట్రం ప్రభుత్వంలో మీరు(ప్రజలు) భాగస్వాములని చెబుతూ.. సంక్షేమ రాజ్యంగా , అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సమిధగా మారి తెలంగాణను ఇచ్చిందని.. కార్యకర్తల కష్టాన్ని శ్రమను గుర్తు పెట్టుకుంటానన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు స్వేచ్ఛ ఉంటుందన్నారు. విద్యార్థి, నిరుద్యోగ , అమర వీరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పారు.
ఇక ముఖ్యమంత్రి హోదాలో తొలుత ఆరు గ్యారంటీల ఫైల్ పై తొలి సంతకం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆ తర్వాత దివ్యాంగురాలు రజిని ఉద్యోగ నియామక ఉత్తర్వులపై రెండో సంతకం చేశారు.
ఇవీ ఆరు గ్యారంటీలు
1. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ. 2,500, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. రూ. 500 కే గ్యాస్ సిలిండర్
2. రైతు భరోసా పథకం కింద రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15 వేలు. వ్యవసాయ కూలీలకు రూ. 12,000. వరి పంటకు రూ. 500 బోనస్ చెల్లింపు
3. గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
4. ఇందిరమ్మ ఇళ్లు పథకింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ. 5 లక్షలు. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం.
5. యువ వికాసం పథకం కింద విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డుతోపాటు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్
6. చేయూత పథ కింద నెలవారీ పింఛను రూ.4,000. రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా రూ. 10 లక్షలు.
ఈ హామీలు అమలు చేయడానికి ఏడాదికి రూ. 70 కోట్లు కావాలి.