Gangula Kamalakar :తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపే కుట్ర.. మంత్రి గంగుల

Byline :  Veerendra Prasad
Update: 2023-10-13 07:22 GMT

తెలంగాణను ఆంధ్రాలో కలిపే కుట్ర జరుగుతోందని (Gangula Kamalakar)  మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ ముసుగులో తెలంగాణకు వచ్చిన ఆంధ్రా వాళ్లు.. రాష్ట్రాన్ని మళ్లీ ఆంధ్రాలో కలపాలని చూస్తున్నారన్నారు. ఆంధ్రా నేతలకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల, ప్రజాశాంతిపార్టీ అధ్యక్షులు కేఏ పాల్, కేవీపీ, కిరణ్ కుమార్ రెడ్డిలను నమ్మొద్దన్నారు. శుక్రవారం ఆయన కరీంనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి గంగుల... .. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ పాలనలో వలసలు తగ్గిపోయాయన్నారు. ఆంధ్రా ముసుగులో కాంగ్రెస్ బిజెపి లిడర్లు వస్తున్నారని, వారిని నమ్మవద్దని కోరారు. కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందాలంటే మరొక అవకాశం ‌ఇవ్వండని వెల్లడించారు.

యువత భవిష్యత్తు బాగుండాలంటే కేసీఆర్ రావాలని కోరారు. డబుల్ ఇంజన్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్, కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల ఉండాలని స్పష్టం చేశారు. 13 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని.. కేసీఆర్ లేని తెలంగాణ ని ఊహించుకొనే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ లేని తెలంగాణ ఆంటే నెర్రలు వారిన తెలంగాణనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్, బీజేపీ బీ ఫామ్‌లు ఢిల్లీలో ఒకే చోట తయారవుతాయని.. ఆ రెండు పార్టీలు కలిసే ఉంటాయని అన్నారు. బీజేపీకి తెలంగాణలో ఈ సారి గుండు సున్నా అని చెప్పారు. భయంతోనే ఈటల రెండు చోట్లా పోటీ చేస్తా అంటున్నారన్నారు. మతతత్వ, భూ కబ్జాలు చేసే పార్టీలకు అధికారం ఇవ్వొద్దని కోరారు. బండి సంజయ్ ఆరోపణలు పట్టించుకోమని అన్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో విఫలం అయిందని విమర్శించారు. కర్ణాటకలో పథకాలు అమలు చెయడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఆరు గ్యారంటీలు ఎలా చేస్తారని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం ‌లేదన్నారు. 




Tags:    

Similar News