Guvvala Balaraju :బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి..

అచ్చంపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత..

By :  Lenin
Update: 2023-11-12 02:16 GMT

నాగర్​కర్నూల్​ జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అచ్చంపేటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. BRS కార్యకర్తలు డబ్బు సంచులు తరలిస్తున్నారనే అనుమానంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఓ వాహనాన్ని ఉప్పునుంతల మండలంలోని వెల్టూర్‌ గేట్‌ వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆపకపోవటంతో వాహనాన్ని వెంబడించారు. అచ్చంపేట పట్టణంలోని అంబేడ్కర్‌ కూడలిలో అడ్డుకొని వాహనంపై రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం ఒకరిపై మరొకరు రాళ్లు వేసుకోగా కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని కాంగ్రెస్‌ కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం ఇరుపార్టీల నాయకులు పోటాపోటీగా నిరనన తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేస్తూ.. నేతల సమక్షంలో మరోసారి ఘర్షణకు దిగారు. అదే సమయంలోనే ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై గుంపులో నుంచి ఒకరు రాయితో దాడికి పాల్పడ్డారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణనే స్వయంగా రాయితో కొట్టారని గువ్వల బాలరాజు అనుచరులు ఆరోపిస్తున్నారు. పోలీసులు వారందరిని చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ఈ దాడిలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(BRS Candidate Balaraju)కు స్వల్ప గాయాలయ్యాయి. హస్తం పార్టీ కార్యకర్తలు తనపై దాడి చేశారని ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలరాజును చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమికి చికిత్స అందించారు. అనంతరం ఆయనను హైదరాబాద్​లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఓటమి భయంతోనే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ అభ్యర్థితో పాటు ఆయన అనుచరులు దాడికి దిగారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 


 


Tags:    

Similar News