Bandi Sanjay : తెలంగాణలో ఒంటరిగానే అధికారంలోకి వస్తం.. బండి సంజయ్
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని మరోసారి స్పష్టం చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. ఆదివారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ బీసీలకు 23 సీట్లు మాత్రమే ఇచ్చిందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదేనని అన్నారు. పార్టీ ఆదేశాల మేరకు రేపు కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నట్లు తెలిపారు
తెలంగాణలో ఒంటరిగానే అధికారంలోకి వస్తామని.. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై నష్టాన్ని కేసీఆర్ కుటుంబం నుండి వసూలు చేస్తామని తెలిపారు. ఒకవేళ ఈ నష్టం ఇవ్వకపోతే కేసీఆర్ ఆస్తులను జప్తు చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, చెక్ డ్యామ్ సహా ఇతర ప్రాజెక్టులకు గ్యారంటీ లేదన్నారు. ఎప్పుడు ఏ ప్రాజెక్టు కూలిపోతుందో అనే అనుమానం ఆయన వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ ఎనిమిది పిల్లర్లు కుంగాయా లేదా చెప్పాలన్నారు.మేడిగడ్డ బ్యారేజీ వద్దకు నిపుణులతో రావాలని, తాము కూడ నిపుణులతో వస్తామని బండి సంజయ్ కేటీఆర్ కు సవాల్ విసిరారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బలిపశువు అవుతారని ఆయన చెప్పారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిని సీఎం చేయకుండా ఉంటే తాము మీకు మద్దతిస్తామని కొందరు ముస్లిం పెద్దలు ఢిల్లీలో రాహుల్ గాంధీతో చెప్పారని తనకు సమాచారం ఉందన్నారు.ఈ విషయమై రాహుల్ గాంధీ కూడ సానుకూలంగా స్పందించారన్నారు. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ లోని ఇతర నేతలు సంతోషపడుతున్నారని బండి సంజయ్ చెప్పారు. కాంగ్రెస్ నేతలు సీఎం పదవి కోసం గొడవ పడుతున్నారన్నారు. కానీ, ప్రజల గురించి పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు.