TS Assembly Elections 2023 : సీఎం కేసీఆర్‌పై పోటీ.. నేడు గజ్వేల్‌కు ఈటల

Byline :  Veerendra Prasad
Update: 2023-10-26 04:12 GMT

హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నేడు గజ్వేల్ లో పర్యటించనున్నారు. గజ్వేల్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన మొదటిసారి నియోజకవర్గానికి రానున్నారు. దీంతో ఆయనకి భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంటి మామిడి నుంచి గజ్వేల్ కోట మైసమ్మ ఆలయం వరకు బీజేపీ నిర్వహించే ర్యాలీలో ఈటెల రాజేందర్ పాల్గొననున్నారు. ముట్రాజ్ పల్లిలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అయితే, ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలోకి గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ అసంతృప్త నాయకులు చేరనున్నారు. అయితే, తెలంగాణ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ను ఓడించటమే లక్ష్యంగా తాను పోటీ చేస్తానని బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రకటించారు.

ఈటల ఆలోచనలకు తగ్గట్టుగానే బీజేపీ అధిష్టానం ఆయనను హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ నుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేసే విధంగా టికెట్ కేటాయించింది. ఇక, ఈ ఎన్నికల్లో కేసీఆర్ ని తాను ఓడించడం ఖాయమని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని పరిస్థితులను బాగానే అధ్యయనం చేశానని ఆయన తెలిపారు. కాగా, తెలంగాణలో హ్యాట్రిక్ విజయం సాధించాలని కేసీఆర్ ఈసారి ఎన్నికలలో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ కూడా హుజూరాబాద్- గజ్వేల్ నుండి పోటీ చేస్తున్నారు. ఇద్దరు ముఖ్య నేతల మధ్య పోటీ ఉండటంతో గజ్వేల్ స్థానంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈటల రాజేందర్ గెలుపుపై ధీమాగా ఉండగా.. కేసీఆర్‌ను ఓడించడం ఖాయమని ఈటల అంటున్నారు.




Tags:    

Similar News