Bandi Sanjay : బహిరంగ సభలో బీజేపీ అధిష్టానానికి కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్.?

Byline :  Veerendra Prasad
Update: 2023-11-10 03:30 GMT

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, ఆత్మీయ సమ్మేళనాలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక బహిరంగ సభల్లో కొందరు నేతలు.. అధికార పార్టీ నాయకులపై నోరుజారుతుండగా, ఇంకొందరు తమ అనుచరులను, అభిమానులను ఉత్సాహపరిచేందుకు ఇంట్రెస్టింగ్ కామంట్స్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌ నియోజకవర్గంలోని జన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్‌ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.



బీజేపీ అభ్యర్థి రమేష్ రాథోడ్ నిర్వహించిన ప్రచార సభలో మాట్లాటేందుకు బండి సంజయ్ రాగా.. ఆయనను చూసి సభలో పాల్గొన్న కార్యకర్తలు, అభిమానులంతా.. సీఎం, సీఎం అంటూ నినాదాలు చేయటం మొదలుపెట్టారు. ఆ నినాదాలతో బండి సంజయ్ చిరునవ్వులు చిందించగా అది చూసి.. ఇంకా గట్టిగా అరిచారు కార్యకర్తలు. దీంతో.. ఇక చాలు ఆపాలన్నట్టుగా సైగ చేశారు బండి సంజయ్. వారి అభిమానానికి మురిసిపోతూనే మైక్ తీసుకున్న బండి సంజయ్.. "మీరు సీఎం సీఎం అంటే ఉన్న పోస్ట్ కూడా పీకేశిండ్రు" అంటూ.. కౌంటర్ డైలాగ్ వేశారు. కాంగ్రెస్‌లో సీఎం పదవి కోసం పది మంది పోటీ పడుతున్నారని, ఎవరు సీఎం అనేది ఇప్పటికీ తేలలేదని చెప్పారు. ఆ పరిస్థితి బీజేపీకి వచ్చేలా కార్యకర్తలు వ్యవహరించవద్దని సూచించారు. అయితే.. ఉన్న పోస్ట్ కూడా పీకేశారనే కౌంటర్ కార్యకర్తలకా.. లేకపోతే నాయకత్వానికా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న సమయంలో పార్టీని పరుగులు పెట్టించా అంటూ ఈమధ్యే ఓ డైలాగ్ వదిలారు సంజయ్. ఆ డైలాగ్ తో తనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంపై బండి సంజయ్ ఒకింత అసంతృప్తితో ఉన్నట్టుగా.. బహిరంగంగా చెప్పకపోయినా ఇలాంటి వ్యాఖ్యల ద్వారా బయటపడుతోంది. నిజానికి బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాకా ఆ పార్టీలో జోష్ కాస్త చల్లబడింది. పలువురు నేతలంతా పక్క పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. అయితే.. ఈ మధ్య బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే సీఎం అంటూ కొత్త నినాదాన్ని తెర మీదికి తీసుకురావటంతో.. మళ్లీ ఆయన అభిమానులు, అనుచరుల్లో ఉత్సాహం వచ్చింది. చూడాలి మరి .. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ఎలాంటి ఫలితాలు ఇవ్వనున్నాయో..?





Tags:    

Similar News