Vijayashanti : బీఆర్ఎస్ పాలనపై విజయశాంతి ట్వీట్

Byline :  Veerendra Prasad
Update: 2023-10-11 03:26 GMT

త్వరలో రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు స్పీడ్‌ పెంచారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన వెంటనే ప్రధాన పార్టీలన్ని ప్రచారానికి సిద్ధమయ్యాయి. ఇక మంగళవారం బీజేపీ నిర్వహించిన ఆదిలాబాద్‌ సభలో ఆ పార్టీ నేతలు కేసీఆర్‌ సర్కార్‌ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ నేత విజయశాంతి సైతం కేసీఆర్‌ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్విట్టర్‌ వేదికగా..‘తెలంగాణ ప్రీ పోల్ సర్వేలు, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు దూరమవుతున్నట్లు తెలియచేస్తున్నవి. దోపిడీ, దుర్మార్గం, అవినీతి, నియంతృత్వంతో నడుస్తున్న ఈ కేసీఆర్ గారి అహంకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజంలోని ఈ మార్పు తప్పక అభినందనీయం. నేను నా తోటి తెలంగాణ ఉద్యమకారులం సంవత్సరాలుగా చెబుతున్న వాస్తవాలు, మా ప్రజల ఆలోచనకు, అవగాహనకు చేరుతున్నట్లు ఇప్పుడిప్పుడే అన్పిస్తున్నది’ అంటూ కామెంట్స్‌ చేశారు.

మరోవైపు.. అమిత్‌ షా నిన్నటి సభలో.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ తో పాటు ప్రతి జిల్లాలో తెలంగాణ విమోచనా దినోత్సవం అధికారికంగా జరుపుతామని అన్నారు. డిసెంబర్ 3న తెలంగాణలో ఎగరబోయేది బీజేపీ జెండానే అన్నారు. కేటీఆర్‌ని సీఎం చెయ్యడమే కేసీఆర్ లక్ష్యమన్నారు . 2014 నుంచి సీఎం అదే పనిలో ఉన్నారని విమర్శించారు. గిరిజనులకు 3 ఎకరాల భూమి, రూ. 10 లక్షల దళిత బంధు హామీలు ఏమయ్యాయని కేసీఆర్ పై విమర్శల వర్షం గుప్పించారు. ఇక రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని అనుకూల పరిస్థితులున్నందున వీటిని ఉపయోగించుకుని విజయం సాధించాలని స్పష్టం చేశారు. విజయం దిశగా కట్టుదిట్ట మైన కార్యాచరణను, ఎన్నికల వ్యూహాలను అమలు చేయాలని రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలను ఆయన ఆదేశించారు.




Tags:    

Similar News