Etela Rajender : 'ఒకవేళ తెలంగాణ ఎన్నికల్లో హంగ్ వస్తే..' ఈటల సంచలన కామెంట్స్

Byline :  Veerendra Prasad
Update: 2023-11-06 09:24 GMT

సీఎం కేసీఆర్‌ పాలనలో బీఆర్ఎస్ కార్యకర్తలకే ‘బీసీ బంధు’ దక్కిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. కేసీఆర్‌ పాలనలో దళితులు, బీసీలు, రైతులు.. ఎవరూ సంతోషంగా లేరన్నారు. అసైన్డ్‌, ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారని.. రూ. లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే స్వయంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోందన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఈటల మాట్లాడారు.

. నీళ్ళు, నియామకాల విషయంలో సీఎం కేసీఆర్ సంపూర్ణంగా విఫలమయ్యారని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మాదిరిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల 5,800 ఎకరాల భూమిని అభివృద్ధి పేరిట అతి చౌక ధరలకు కేసీఆర్ కుటుంబం తీసుకుందని ఆరోపించారు. ఒక్క గజ్వేల్‌ లోనే 30 వేల మంది కేసీఆర్ బాధితులున్నారని, ఆయన అడుగులకు మడుగులు వత్తే వారికే బీసీ బంధు ఇచ్చారని విమర్శించారు.

ఒకవేళ తెలంగాణ ఎన్నికల్లో హంగ్ వస్తే.. బీఆర్ఎస్ , కాంగ్రెస్ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అన్నారు. గతంలో కలసి పనిచేసిన చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటైతే తాను గజ్వేల్‌లో ఎందుకు పోటీ చేస్తానని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ గతంలో ‌ఎప్పుడూ కలసి పోటీ చేయలేదని, బీజేపీపై విష ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్‌ను నిలువరించే సత్తా ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే కమలం పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించాలని గతంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వారు బీఆర్ఎస్ లో చేరారని చెప్పారు.




Tags:    

Similar News