అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీజేపీ నిర్ణయించింది. ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడాన్ని నిరసిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ ముందు ప్రమాణం చేసేందుకు అన్న బీజేపీ ఎమ్మెల్యేలు నిరాకరించారు. ఈ క్రమంలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన బీజేపీ ఎమ్మెల్యేలు తిరిగి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిపోయారు.
ఇదిలా ఉంటే ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఆయనను ప్రొటెం స్పీకర్గా ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. సీనియర్ వ్యక్తులను ప్రొటెమ్ స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. కానీ, ఎంఐఎంతో కుట్ర పన్ని కాంగ్రెస్ సంప్రదాయాలను పాటించడలేదని అసహనం వ్యక్తం చేశారు. అందుకే తమ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
మరోవైపు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను ఎంపిక చేసినందున శనివారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ శుక్రవారమే స్పష్టం చేశారు. తన ఎమ్మెల్యేలు ఎవరూ ప్రమాణ స్వీకారం చేయరని తేల్చి చెప్పారు.