Kishan Reddy : బీజేపీ బాగా పనిచేసింది.. మంచి ఫలితాలు వస్తాయి : కిషన్ రెడ్డి
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ సమర్థంగా పనిచేసిందని.. మంచి ఫలితాలు ఆశిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ కుట్రతో తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడిందని ఆరోపించారు. అయినా తమ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కొన్నారని చెప్పారు. దీక్షా దివాస్ పేరుతో బీఆర్ఎస్ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని విమర్శించారు. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా.. కేసీఆర్ చెప్పినట్లే నడుచుకున్నారని తెలిపారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలకు తెరతీసిందని కిషన్ రెడ్డి విమర్శించారు. సీఎం, ప్రధాని కలిసి ఉన్న ఫోటోను చూపించి తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు. ఇంకా పోలింగ్ కొనసాగుతోందని.. పూర్తి పోలింగ్ సరళి వచ్చిన తర్వాత మరింత స్పష్టత వస్తుందన్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద జరిగిన సంఘటనలను తాను పూర్తిగా ఖండిస్తున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ఏపీ ప్రభుత్వం తీరు సరిగ్గా లేదన్నారు. ఏకపక్షంగా గేట్లు ఎత్తి నీరు తీసుకెళ్లడం ఏంటని మండిపడ్డారు. ఇదంతా బీఆర్ఎస్ - వైసీపీ కలిసి ఆడిన డ్రామా అని అన్నారు.