TS Assembly Elections 2023 : నేడు పాలేరుకు సీఎం కేసీఆర్.. పొంగులేటికి చెక్?
ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ దూసుకుపోతున్నారు. నిన్న ఏకంగా మూడు బహిరంగ సభల్లో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. ఇవాళ ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టనున్నారు. ఇందులో భాగంగానే నేడు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్… బహిరంగ సభలో పాల్గొంటారు. జీళ్లచెరువులో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉండనుంది. పాలేరు నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని సీఎం కేసీఆర్ వ్యూహాలు చేస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా పోటీ చేసే ఛాన్స్ ఉంది. అటు షర్మిల కూడా పోటీలో ఉన్నారు. ఈ తరుణంలో ఇవాళ్టి సభలో సీఎం కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభను విజయవంతం చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే, పాలేరు బీఆర్‌ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి వారం రోజులుగా కసరత్తు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1గంటకు జీళ్లచెరువులో జరిగే ఈ సభకు జనసమీకరణ చేసేందుకు గాను జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులతో సమన్వయ కమిటీలు నియమించి వారికి దిశానిర్దేశం చేశారు. అయితే మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రె్‌సలో చేరిన తర్వాత కేసీఆర్ ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారానికి రాబోతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఇదే పాలేరు నియోజకవర్గనుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలో దిగడం దాదాపు ఖాయం కావడంతో కందాల ఉపేందర్‌రెడ్డి విజయమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో తన తొలి ప్రచార సభకు పాలేరును ఎంచుకున్నారని, పొంగులేటి లక్ష్యంగా కేసీఆర్ పాలేరుపై ప్రత్యేక దృష్టిపెట్టారన్న చర్చ జరుగుతోంది.
సీఎం కేసీఆర్ రాకతో తో జీళ్ల చెరువు గ్రామం సభ ప్రాంగణం మొదలుకొని ఖమ్మం – సూర్యాపేట పేట ప్రధాన రహదారి వెంట రెండు కిలో మీటర్ల మేరకు సీఎం కేసీఆర్, కేటీఆర్ ఎమ్మెల్యే కందాళ భారీ కటౌట్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో సభ ప్రాంగణం ఆవరణం మొత్తం గులాబీ మయమైంది.