Medak Parliamentary Constituency:మెదక్ ఎంపీ సీటు కోసం పోటీపడుతున్న బీఆర్ఎస్ నేతలు
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఒక్క మెదక్ మినహా.. మిగతా 6 (పటాన్‌చెరు, సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక )స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీ(మొత్తంగా కలిపి 2,05,015 )తో గెలుపొందారు. బీఆర్ఎస్‌కు కంచుకోటగా మారిన మెదక్ లో.. ఇప్పుడు రాబోయే లోక్‌సభ పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ తరపున పోటీ చేసేందుకు పలువురు ఆశావాహులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సైతం మెదక్ పార్లమెంట్ పరిధిలోనే ఎమ్మెల్యేలుగా గెలిచినందున బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి గెలుపునకు ఎక్కువ అవకాశాలున్నాయనే అంచనాల్లో ఆశావాహులున్నారు.
2004లో అలె నరేంద్ర, 2009లో విజయశాంతి, 2014 సాధారణ ఎన్నికల్లో కేసీఆర్ గెలిచారు. కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో 2014 ఉప ఎన్నికతో పాటు 2019 జనరల్ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. వరుసగా ఐదు ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నందున వచ్చే ఎన్నికల్లోనూ సత్తా చాటాలని బీఆర్‌ఎస్ అధిష్టానం భావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందున వచ్చే ఎన్నికల్లోనూ మెదక్ ఎంపీ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలనే ఆలోచనలో ఉంది. దీనికోసం గెలుపు గుర్రాన్నే బరిలోకి దించాలని అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఆశావాహులు వీరే.
నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి:
2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి... ఈసారి మాత్రం అధిష్టానం నిర్ణయంతో సునీతాలక్ష్మారెడ్డి తన సీటును త్యాగం చేశారు. 2023 ఎన్నికల్లో సునీతాలక్ష్మారెడ్డికి గెలుపు కోసం కష్టపడి పనిచేశారు. అయితే మదన్‌రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇస్తామని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు హామీ ఇచ్చారని, ఆ ఒప్పందం ప్రకారమే సునీతారెడ్డి గెలిపించారని టాక్. అయితే మదన్‌రెడ్డికే ఎంపీ టికెట్ ఇస్తారా..? లేదంటే రాజ్యసభకు పంపి పార్లమెంట్ ఎన్నికల్లో మరొకర్ని పోటీ చేయిస్తారా..? అనే చర్చ నడుస్తుంది.
వంగ ప్రవీణ్‌రెడ్డి:
సిద్దిపేట అర్బన్ ఎంపీపీ వంగ సబిత భర్త వంగ ప్రవీణ్‌రెడ్డి కూడా మెదక్ ఎంపీగా పోటీ చేయాలనే ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌లో తెరవెనకాల ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దడంతో పాటు ఆర్థిక పరిపుష్టి కల్గిన ప్రవీణ్‌రెడ్డి ఎంపీ టికెట్ పరిశీలనలో ఉన్నారు. వంగ ప్రవీణ్ రెడ్డి హరీశ్‌రావుకు నమ్మకమైన వ్యక్తి అనే పేరు ఉంది.
గాలి అనిల్‌కుమార్:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షుడి పదవికి రాజీనామా చేసి, బీఆర్ఎస్‌లో చేరిన గాలి అనిల్‌కుమార్ కూడా ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి నర్సాపూర్ టికెట్ ఆశించగా.. అధిష్టానం పక్కన పెట్టింది. దీంతో బీఆర్ఎస్‌లో చేరారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన రెండో స్థానంలో నిలిచారు. దాంతో వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని బీఆర్‌ఎస్ టికెట్ రేసులో ఉన్నారు.
వంటేరు ప్రతాపరెడ్డి:
గత ఎన్నికల్లో కేసీఆర్‌పై కాంగ్రెస్ తరఫున పోటీ చేసి, ఓడి చివరకు బీఆర్ఎస్ లో చేరిన వంటేరు ప్రతాపరెడ్డి సైతం ఈసారి మెదక్ ఎంపీ రేసులో ఉన్నట్లు సమాచారం. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వంటేరు గజ్వేల్ టికెట్ అడిగారు. అయితే కేసీఆర్ ఇదే స్థానంలో పోటీ చేయడంతో.. తనకు మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రతాప రెడ్డే ప్రకటించారు. సీఎం హౌదాలో కేసీఆర్ పోటీ చేసినందున ఆయన గెలుపు కోసం వంటేరు కష్టపడి పనిచేశారు. దీంతో ఆ కృతజ్ఞతతో తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని వంటేరు కోరుతున్నారు.
వీరితో పాటు సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన పట్నం మాణిక్యం, అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వకపోవడడంతో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన కంఠారెడ్డి తిరుపతిరెడ్డి కూడా మెదక్ ఎంపీ స్థానానికి పోటీ చేయాలనే ఆశలో ఉన్నట్లు తెలిసింది.