KCR : రైతుబంధుపై ఇచ్చిన ఆదేశాలు ఉపసంహరించుకోండి - ఈసీకి బీఆర్​ఎస్​ విజ్ఞప్తి

Byline :  Veerendra Prasad
Update: 2023-11-27 09:52 GMT

రైతుబంధుపై ఇచ్చిన ఆదేశాలు ఉపసంహరించుకోవాలని ఎన్నికల సంఘానికి బీఆర్​ఎస్​ విజ్ఞప్తి చేసింది. రైతుబంధు చెల్లింపులను అనుమతించాలని కోరింది. రైతుల ప్రయోజనాల కోసం రైతుబంధు సాయం పంపిణీని అనుమతించాలని ఈసీని కోరింది బీఆర్ఎస్. రైతుబంధు అనుమతి ఉపసంహరణ నేపథ్యంలో సీఈఓ వికాస్ రాజాను బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు మాట్లాడుతూ.. రైతుబంధుపై మంత్రులు మాట్లాడితే వాళ్లకు నోటీసులు ఇవ్వాలి కానీ.. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా రైతుబంధు ఎలా అపుతారని ప్రశ్నించారు. రాజకీయనేతల్లో ఉన్న కోపతాపాలను రైతుల మీద రుద్దకూడదని కేశవరావు హితవు పలికారు. ఎన్నికల ప్రచారంలో రైతుబంధు పంపిణీ చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలతోనే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఉదయం నుంచే దీనిపై ప్రధాన పార్టీల నాయకులు మీడియా ముఖంగా, సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు.

రైతుబంధు మీద ఎన్నికల ప్రచార సభలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఈ అంశానికి కేంద్ర బిందువుగా మారాయి. హరీష్ రావు నోటిదూల, కేసీఆర్ అతి తెలివి వల్లే... రైతు బంధు ఆగిందని, రైతుల ఖాతాల్లో పడాల్సిన రూ.5వేల కోట్లు ఆగిపోయాయంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. రైతుబంధు రాకపోవడానికి కారణమైన బీఆర్ఎస్ నేతలను తరిమికొట్టాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ కుట్ర వల్లే రైతుల ఖాతాలో పడాల్సిన నిధులు ఆగిపోయాయన్నారు. అల్లుడు హరీష్ వల్లే రూ.5వేల కోట్లు ఆగిపోయాయని... దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలని రేవంత్ అన్నారు. నవంబర్ 30 న అల్లుడు హరీష్ కు.. మామ కేసీఆర్‌కు బుద్ది చెప్పాలన్నారు.

మరోవైపు ఈ విషయంపై మాట్లాడిన హరీశ్ రావు.. తెలంగాణ రైతులపై, రైతుబంధుపై కాంగ్రెస్ పార్టీ కుట్ర మరోసారి బయటపడిందని అన్నారు. రైతన్నలకు సాయం అందకుండా కుట్ర పన్నిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు పంపిణీ చేయొచ్చంటూ ఈసీ అనుమతిచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ తన దుర్బుద్ధిని వదులుకోలేదని మండిపడ్డారు. టీపీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ నిరంజన్ ఫిర్యాదు చేయడం వల్లే రైతుబంధు పంపిణీని నిలిపివేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని ఆరోపించారు. రైతుబంధును కాంగ్రెస్ పార్టీ ఆపిందనడానికి ఇంతకంటే సాక్ష్యం అవసరంలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను అర్థం చేసుకోవాలంటూ తెలంగాణ ప్రజలు, రైతులకు మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.




Tags:    

Similar News