Jogu Ramanna :పార్టీలు మారినా టికెట్ దక్కించుకుంటున్న అభ్యర్థులు
సాధారణంగా ఒక పార్టీ సభ్యత్వం తీసుకుని.. ఏళ్ల తరబడి ఆ పార్టీలో కొనసాగి సేవలందించినా.. తగిన న్యాయం జరిగి టికెట్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఉంటుంది. అలాంటిది వీరు మాత్రం పార్టీ ఏదైనా సరే.. ఆ పార్టీ టికెట్‌ను దక్కించుకోవడంతో పాటు.. ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తారు. తమ సత్తా చూపిస్తారు. గతంలో ఉన్నట్లు ఎప్పటికీ ఒకే పార్టీని అంటిపెట్టుకొని, ఆ పార్టీ ఆశయాలకు కట్టుబడి పని చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. టికెట్ రాకపోయినా, సమన్యాయం జరగక పోయినా వేరే పార్టీలోకి మారుతున్నారు. అలా వెళ్లడమే కాకుండా ఆ పార్టీల నుంచి టికెట్ పొంది మాజీ పార్టీలతో ఎన్నికల బరిలో తలపడుతున్నారు.
ఈ లిస్ట్ లో ఎప్పటికీ ముందుంటారు ఉమ్మడి ఆదిలాబాద్ లోని ఖానాపూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రమేశ్ రాఠోడ్. మొదట టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. తర్వాత ఎంపీ అయ్యారు. కొన్నాళ్లకు కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యే, ఎంపీగా టికెట్ సాధించినా గెలుపొందలేదు. ఇప్పుడు బీజేపీ నుంచి టికెట్ దక్కించుకున్నారు. 2009లో ఆదిలాబాద్ నుంచి టీడీపీ టికెట్ తీసుకుని గెలిచిన జోగు రామన్న.. బీఆర్ఎస్ లో చేరి టికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం వరుసగా నాలుగో సారి టికెట్ పొందారు. 2004లో బీఆర్ఎస్ తరుపున బోథ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు సోయం బాపురావు. తర్వాత 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో కాంగ్రెస్ లో చేరగానే టికెట్ దక్కించుకున్నారు. ఆ పార్టీ నుంచి కూడా ఓడిపోయి.. 2019లో బీజేపీలో చేరారు. ఆ వెంటనే పార్లమెంట్ టికెట్ దక్కించుకుని విజయం సాధించారు. తాజాగా అదే నియోజకవర్గం నుంచి బోథ్ తరుపున బరిలోకి దిగారు.