Chief Election Commissioner : ఎలక్షన్ కమిషనర్ల నియామక బిల్లులో కీలక మార్పులు

Byline :  Kiran
Update: 2023-12-12 10:13 GMT

ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లులో కేంద్రం కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లులో మార్పులు చేసినట్లు సమాచారం. గతంలో మాదిరిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల హోదా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. విపక్షాలు, మాజీ సీఈసీల నుంచి వ్యక్తమైన ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈసీల నియామకాలకు సంబంధించి కేంద్రం ఇటీవల ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక నిబంధనలు, పదవీకాలం బిల్లు-2023ను ఈ ఏడాది ఆగస్టులో రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో ఎన్నికల కమిషనర్ల హోదాల్లో మార్పు చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా సీఈసీ, ఈసీల హోదా ఉండగా.. ప్రతిపాదిత బిల్లులో దాన్ని మార్చింది. వీరికి కేబినెట్‌ సెక్రటరీలతో సమానమైన హోదాను ఇస్తామని చెప్పింది. అయితే ఈ మార్పును విపక్ష నేతలు, కొందరు మాజీ సీఈసీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయం ఎన్నికల సంఘం స్వతంత్రతను ఉల్లంఘించడమేనని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బిల్లులో కేంద్రం కొన్ని సవరణలు చేసినట్లు సమాచారం.

సవరించిన బిల్లులో సీఈసీ, ఇతర కమిషనర్లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా వేతనాలు చెల్లించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సవరణతో సీఈసీ, ఈసీలు పదవుల్లో ఉండగా వారిపై ఎలాంటి సివిల్‌, క్రిమినల్‌ చర్యలు చేపట్టేందుకు వీలుండదు. మరోవైపు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీల్లో సీజేఐ స్థానంలో కేంద్ర మంత్రి ఉంటారని గతంలో కేంద్రం ప్రకటించింది. అయితే దీనిపై పార్లమెంటులో చట్టం చేసే వరకు ప్రధాని నేతృత్వంలో లోక్‌సభలో విపక్ష నేత, సీజేఐ కలిసి ఈ నియామకాలు చేయాలని మార్చిలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, తాజా బిల్లు ప్రకారం కమిషనర్ల నియామకాల కోసం ప్రధాని నేతృత్వంలో ఏర్పాటయ్యే త్రిసభ్య సంఘంలో లోక్‌సభ విపక్ష నేత, ప్రధాని నియమించే ఒక కేబినెట్‌ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఈ ప్రతిపాదిత కమిటీపైనా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే దీనిలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. సవరణలతో కూడిన బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.



 


 

 

Tags:    

Similar News