Mallu Bhatti Vikramarka : ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం.. భట్టి విక్రమార్క

Byline :  Veerendra Prasad
Update: 2023-11-27 12:03 GMT

తమ పార్టీ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. సోమవారం నాడు బోనకల్ మండలం, చొప్పకట్లపాలెం ఆంజనేయస్వామి దేవాలయంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చిన ఆఫిడవిట్ పైన సంతకం చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పూర్తిగా అంకితం అవుతానని.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతానని చెప్పారు. నిజాయితీగా నా బాధ్యతలు నిర్వహిస్తానన్నారు. అవినీతికి ఏమాత్రం తావు లేకుండా పారదర్శకంగా పనిచేస్తూ తెలంగాణ ప్రగతి కోసం కృషి చేస్తానని అన్నారు. మధిర నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, పైన పేర్కొన్న విషయాలన్నింటికీ సదా కట్టుబడి ఉంటానని ఆఫిడవిట్‌తో దేవుడి సాక్షిగా హామీ ఇచ్చారు.

ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్.. కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ అని అన్నారు. కరెంటును పట్టుకుంటే ఏమవుతుందో.. కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్నా అదే అవుతుంది.. కేసీఆర్ మాడిపోతావ్ అని మండిపడ్డారు. మేం ఇచ్చిన హామీలను బరాబర్ అమలు చేసి చూపిస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే.. బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో బీజేపీకి ఓటేస్తోందని భట్టి విక్రమార్క విమర్శించారు.




Tags:    

Similar News