TS Assembly Elections 2023 : నవంబర్ 30న గుద్దుడు గుద్దితే పోలింగ్ బాక్సులు పగిలిపోవాలె - సీఎం

Byline :  Kiran
Update: 2023-10-31 10:38 GMT

నవంబర్ 30న గుద్దుడు గుద్దితే పోలింగ్ బాక్సులు పగిలిపోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. మంచి చెడు ఆలోచించి ఓటు వేస్తేనే ప్రజలు గెలుస్తారని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ హుజూర్ నగర్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. పేగులు తెగేదాక కొట్లాడితే తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. ఓటు మన తలరాతను నిర్ణయిస్తుందని అందుకే జనం ఆలోచించి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు.

పదవులు తీసుకుని

కాంగ్రెస్ హయాంలో 58 ఏండ్లు అరిగోస పడ్డామని బీఆర్ఎస్ అధినేత గుర్తు చేశారు. సాగు నీరు, కరెంటుతో పాటు అనేక విషయాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ నేతలు ఏనాడూ నోరు మెదపలేదని కేసీఆర్ మండిపడ్డారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టును కట్టాల్సిన ప్రాంతంలో కట్టలేదని, ఏళేశ్వరంలో కట్టాల్సి ఉన్నా ఆ తర్వాత ప్లాన్ మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు పదవులు ఇస్తే చాలనుకుని కండ్లు మూసుకుని కూర్చున్నారే తప్ప మాట్లాడినవారే లేరని అన్నారు. తెలంగాణకు ఒక్కపైసా ఇవ్వనని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినా ఒక్కరూ ప్రశ్నించలేదని కేసీఆర్ గుర్తు చేశారు.

డజన్ మంది సీఎం అభ్యర్థులు

కాంగ్రెస్ లో డజన్ మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని కేసీఆర్ సటైర్ వేశారు. వారికి ఓట్లు కావాలే తప్ప ప్రజల బాధలు అవసరం లేదని అన్నారు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితే లేదని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా దళితులు వివక్షకు గురవుతున్నా అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పట్టించుకోలేదని.. పదవులు, కాంట్రాక్టులే ఆ పార్టీ వారికి ముఖ్యమని అన్నారు.

ధరణిని తీసేస్తే..

దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం కేవలం 3గంటల కరెంటు చాలని అంటున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ను తీసేస్తామని అంటున్నారని, భట్టి విక్రమార్క ఏకంగా దాన్ని బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు. రైతుల భూముల రికార్డులు పారదర్శకంగా ఉండాలనే ధరణి తెచ్చామని స్పష్టం చేశారు. ధరణి కారణంగానే రైతుబంధు, రైతు బీమా, ధాన్యం కొన్న సొమ్ము డైరెక్టుగా రైతుల ఖాతాలో పడుతున్నాయని చెప్పారు.

రేషన్ కార్డుపై సన్నబియ్యం

ఎన్నికల కోసం ఇష్టానుసారం హామీలు ఇవ్వడంలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆసరా పింఛను మొత్తాన్ని రూ.3వేలు చేస్తామని, ఆ తర్వాత ఏటా రూ.500 చొప్పున పెంచుతామని చెప్పారు. రైతు బంధును రూ.12వేలు చేసి వచ్చే ఐదేళ్లలో ఆ మొత్తాన్ని రూ.16వేలకు తీసుకెళ్తామని అన్నారు. రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. బడి పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తున్నామని, కంటివెలుగు ద్వారా లక్షల మంది కళ్లద్దాలు ఇచ్చామని చెప్పారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో పాటు మహిళలకు ప్రతి నెలా రూ. 3వేల చొప్పున ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 




Tags:    

Similar News