TS Assembly Elections 2023 : కష్టసుఖాలు తెలిసిన మల్లారెడ్డిని మళ్లీ గెలిపించండి - సీఎం కేసీఆర్
తెలంగాణ ఏర్పడకుంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏర్పడేది కాదని సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన మేడ్చల్ ప్రజలు చాలా చైతన్యవంతులు అని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేంద్రానికి తలొగ్గి.. తలకాయలు గంగిరెద్దుల్లా ఊపితే 58ఏళ్లు గోసపడ్డామని ఫైర్ అయ్యారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినప్పుడు చాలా మంది అవహేళన చేశారని కేసీఆర్ అన్నారు. 15 ఏండ్లు పోరాడి స్వరాష్ట్రం తెచ్చుకున్నామని చెప్పారు. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వమని కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే ఎందుకివ్వరని ఒక్క నేత కూడా ప్రశ్నించలేదని గుర్తు చేశారు.
ఎన్నికలకు ముందు ఆపద మొక్కుల వారు వస్తారని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారని వారి మాటలకు మోసపోవద్దని కేసీఆర్ కోరారు. గతంలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి ఏడ్చినా ఎవరూ పట్టించుకోలేదని, కరెంటు లేక సగం పంట ఎండిపోయేదని అన్నారు. కానీ ఇప్పుడా బాధలేదని, కాళేశ్వరం, సీతారామ తదితర ప్రాజెక్టుల ద్వారా సాగునీటి కష్టాలు తొలగిపోయానని అన్నారు. తాగునీటి బాధ కూడా దూరమైందని చెప్పారు. మేడ్చల్ లోని ప్రతి గ్రామం బస్తీలో రూ.350 కోట్ల వ్యయంతో మంచినీటి సరఫరా ఏర్పాట్లు చేశామని కేసీఆర్ స్పష్టం చేశారు.
మేడ్చల్, ఎల్బీ నగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్ ప్రాంతాలు మినీ భారతదేశంలాంటివని అక్కడ అన్ని రాష్ట్రాల వారు ఉంటారని కేసీఆర్ చెప్పారు. వివిద రాష్ట్రాల నుంటి ఏటా ఆయా ప్రాంతాలకు అనేక మంది పేదలు వలసలు వస్తారని, అలా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా అమలు చేసి 90లక్షల కుటుంబాలకు అండగా నిలుస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. మార్చి నుంచి ఈ పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్న తెలంగాణలో రేషన్ కార్డుదారులందరికీ అన్నపూర్ణ స్కీం కింద సన్నబియ్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఆసరా పెన్షన్లు రూ.2 వేల నుంచి విడతలవారీగా రూ.5వేలకు పెంచుతామని చెప్పారు. రైతు బంధును వచ్చే ఏడాది రూ.10వేల నుంచి 12 వేలకు ఆ తర్వాత దశలవారీగా రూ.16వేలకు పెంచనున్నట్లు ప్రకటించారు. అగ్రవర్ణ పేదల పిల్లల కోసం రాష్ట్రవ్యాప్తంగా 119 గురుకులాలు ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్ నగరంలో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన మల్లారెడ్డిని మళ్లీ గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.