KCR : చెప్పింది చేసినం.. జానారెడ్డే మాట నిలబెట్టుకోలే - సీఎం కేసీఆర్

Byline :  Kiran
Update: 2023-11-14 10:52 GMT

బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసమని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే ఎవరి చేతుల్లో రాష్ట్రం ఉంటే బాగుంటుందో ప్రజలే నిర్ణయించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ హాలియాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఓటు తలరాత మారుస్తుందని, ఆలోచించి ఓటేస్తే ప్రజాస్వామ్యం, ప్రజలు గెలుస్తారని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ 50ఏండ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిందని, బీఆర్ఎస్ పదేండ్ల పాలించిందన్న కేసీఆర్ ఎవరి కాలంలో ఏం జరిగిందో ప్రజలే ఆలోచన చేయాలని అన్నారు. కాంగ్రెస్ ఏనాడూ ధైర్యంగా పనిచేసి ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థిక నిపుణులతో చర్చించి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీలేదని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో కరెంటు మీదనే వ్యవసాయం ఆధారపడి ఉందని అందుకే 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. రైతులకు రెండేండ్లలో 24 గంటల కరెంటు ఇస్తామని అసెంబ్లీలో ప్రకటిస్తే విపక్ష నేతగా ఉన్న జానారెడ్డి రెండేండ్లలో కాదు నాలుగేండ్లలో ఆ మాట నిలబెట్టుకున్నా గులాబీ కండువా కప్పుకుంటానన్నారని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదిన్నరలోనే 24 గంటల కరెంటు ఇచ్చిందని, జానారెడ్డి మాత్రం మాట తప్పిండని అన్నారు. జానారెడ్డి గులాబీ కండువా కప్పుకోకపోగా.. ఉప ఎన్నిక సమయంలో భగత్ మీద పోటీ చేస్తే నియోజకవర్గ ప్రజలే బుద్ది చెప్పారని అన్నారు. గతంలో మంత్రిగా ఉన్న ఆయన.. రోడ్లు వేయించడం తప్ప కనీసం డిగ్రీ కాలేజీ కూడా తీసుకురాలేదని విమర్శించారు. మళ్లీ అధికారం ఇచ్చినా ఏం చేయరని అన్నారు.




Tags:    

Similar News