KCR : కుల, మత, జాతి బేధాల్లేకుండా బీఆర్ఎస్ మేనిఫెస్టో - కేసీఆర్

Byline :  Kiran
Update: 2023-10-16 12:49 GMT

హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న భువనగిరి భవిష్యత్తులో అద్బుతంగా అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఐటీ రంగంలో మంచి అవకాశముందని చెప్పారు. భువనగిరిని ఐటీ హబ్ గా మార్చాలని ఇటీవలే మంత్రి కేటీఆర్ తో చెప్పిన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే భువనగిరిలో ఐటీ హబ్ తో పాటు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. స్వరాష్ట్రంలో భూముల ధరలు బ్రహ్మాండంగా పెరిగాయని కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం భూముల రేట్లు కోట్లే తప్ప లక్షలు పలకడంలేదని చెప్పారు. మళ్లీ గెలిచాక బస్వాపూర్ రిజర్వాయర్ ప్రారంభానికి వస్తానని హామీ ఇచ్చారు.

భువనగిరి నియోజకవర్గంలో 50వేలకుపైగా మెజార్టీతో విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ సంస్కారం లేకుండా తయారైందని, అందుకే సీనియర్ నేత పొన్నాల ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారని చెప్పారు. అలాంటి పార్టీకి అధికారం అప్పజెప్పాలో లేదో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. కులం, మతం, జాతి బేధాలు లేకుండా అన్ని వర్గాలకు లబ్ది చేకూరేలా మేనిఫెస్టో రూపొందించామని కేసీఆర్ స్పష్టం చేశారు. తమకు మళ్లీ అధికారం కట్టబెడితే కేసీఆర్ బీమా, అందరికీ సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు.




Tags:    

Similar News