TS Assembly Elections 2023 : పాలమూరులో ఏ మూలకెళ్లిన కళ్లల్లో నీళ్లు తిరిగేవి - సీఎం కేసీఆర్

Byline :  Kiran
Update: 2023-10-18 11:45 GMT

ఉద్యమ సమయంలో మహబూబ్ నగర్ జిల్లాలోని ఏ మూలకు వెళ్లినా కళ్లలో నీళ్లొచ్చేవని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజల ఆకలి తీర్చేందుకు గంజి, అంబలి కేంద్రాలు పెడితే గుండెలవిసేవని చెప్పారు. జడ్చర్లలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్.. ఉద్యమం సమయంలో పాలమూరు దుస్థితిని గుర్తు చేసుకున్నారు. మహబూబ్ నగర్లో తిరిగితేనే ప్రజల కష్టాలు తెలుస్తాయని, అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయమని జయశంకర్ సార్ సూచించారని చెప్పారు. పాలమూరు ఎంపీగా ఉంటూనే తెలంగాణ సాధించానని అందుకే ఆ జిల్లా చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.

మహబూబ్ నగర్ గోస చూసి నడిగడ్డలోని ఓ గ్రామంలో కన్నీళ్లు పెట్టుకున్నామని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సమైక్య పాలనలో కొందరు పాలకులు పాలమూరును దత్తత తీసుకున్నా చేసిందేమీ లేదని అన్నారు. కృష్ణా జలాల్లో హక్కు సాధించడం కోసం ఎంతో పోరాటం చేశామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక నీళ్లకోసం చాలా పరిశోధనలు చేశామని కేసీఆర్ స్పష్టం చేశారు. పాలమూరు ఎత్తిపోతలకు కేవలం 9టీఎంసీల సామర్ధ్యం ఉన్న జూరాల నుంచి నీళ్లు తీసుకోమన్నారని పట్టుబట్టి మరీ సోర్స్ను శ్రీశైలంకు మార్చామని కేసీఆర్ గుర్తు చేశారు. ఇప్పటికీ జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలంటున్న కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలని మండిపడ్డారు.




Tags:    

Similar News