KCR : కాంగ్రెస్ వస్తే ధరణి పోతది.. రైతు బంధు బంద్ అయితది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీ భువనగిరిని ఆరాచక శక్తులకు అడ్డాగా మార్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. జనగామ నుంచి భువనగరికి చేరుకున్న ఆయన.. బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన సభలో పాల్గొన్నారు. జిల్లాలో బస్వాపూర్ ప్రాజెక్టు పనులు 98శాతం పూర్తయ్యాయని ప్రజలు మరోసారి గెలిపిస్తే త్వరలోనే దాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ పాత రాజ్యమే వస్తదని కేసీఆర్ అన్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని ఆ పార్టీ నాయకులు అంటున్నారని, అదే జరిగితే మళ్లీ వీఆర్ఓలు, అధికారులు వచ్చి అంతా ఆగమైతదని చెప్పారు. రైతులతో ఆటాడుకుందమన్న ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు కౌలు రైతుల రాగం అందుకున్నారని కేసీఆర్ విమర్శించారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే పైరవీకారులు వచ్చి భూమి రికార్డులు మారుతాయని, అందుకే రైతులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
9ఏండ్లలో తెలంగాణ అనేక రకాలుగా బాగుపడ్డదని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రం ఏర్పడే నాటికి తాగు, సాగు నీళ్లు లేక చాలా కష్టాలుండేవని, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. కాంగ్రెసోళ్లు వస్తే ధరణి పోయి మళ్లీ రైతులు కేసుల పాలవుతరని, కరెంటు పోతదని, రైతు బంధు బంద్ అయితదన్న కేసీఆర్ అందుకే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓట్లు వచ్చినయని ఆగం కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.