TS Assembly Elections 2023 : కాంగ్రెస్ చేసిన తప్పుకు 60 ఏండ్లు గోసపడ్డం - సీఎం కేసీఆర్

Byline :  Kiran
Update: 2023-10-18 11:56 GMT

1956లో జరిగిన చిన్న పొరపాటు వల్ల తెలంగాణను ఆంధ్రాలో కలిపారని ఫలితంగా 60 ఏండ్లు గోసపడ్డామని కేసీఆర్ అన్నారు. సమైక్య పాలనలో నాయకుల నిర్లక్ష్యం వల్ల మహబూబ్ నగర్ లోని పలు తాలూకాలు వలసలతో ఖాళీ అయ్యాయని చెప్పారు. పడికిలెత్తి పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని తెచ్చుకున్నామని కేసీఆర్ అన్నారు. తాను చావు నోట్లో తల పెట్టి పోరాడితేనే తెలంగాణ వచ్చిందని చెప్పారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలే అడ్డుకున్నారని కేసీఆర్ మండిపడ్డారు. 90ఏండ్ల పోరాటం తర్వాత ఒక్కొక్కటిగా అనుమతులు వస్తున్నాయని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతలను ఇప్పటికే ప్రారంభించామని, రిజర్వాయర్లన్నీ పూర్తయ్యాయని 3 -4 నెలల్లో బ్రహ్మాండంగా అన్నింటినీ ప్రారంభించుకుందామని చెప్పారు. దీంతో పుష్కలంగా నీళ్లు అంది పాలమూరు కరువు దూరమైపోతని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

కాంగెస్ కు మళ్లీ అధికారం కట్టబెడితే కరెంటు కష్టాలు కొనితెచ్చుకున్నట్లేనని కేసీఆర్ చెప్పారు. కర్నాటకలో 20 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కేవలం 5 గంటలు మాత్రమే ఇస్తామని మోసం చేశారని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు వ్యవసాయానికి కేవలం 3 గంటల కరెంటు చాలని అంటున్నాడని విమర్శించారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలోనూ కరెంటు కోసం రైతులు రోడ్డెక్కుతున్నారన్న ఆయన.. దేశంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ కు అధికారం అప్పగిస్తే రైతుబంధు, దళిత బంధు, 24 గంటల కరెంటు పథకాలన్నీ బంద్ పెడ్తరని అందుకే ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ సూచించారు.



 


Tags:    

Similar News