KCR : అనుమానమే లేదు.. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. సీఎం కేసీఆర్
58 ఏళ్లపాటు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ఇబ్బంది పెట్టిందన్నారు సీఎం కేసీఆర్. 2004 లో పొత్తుకి వచ్చి 2005 లో మోసం చేసిందన్నారు. కరీంనగర్ లోనే తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టామని, ఆ సమయంలో కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అన్నట్లు పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నామన్నారు. కరీంనగర్ లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గోన్న సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రం బాగుపడిందన్న విషయాన్ని రెండు విషయాలతో పోలుస్తామని... ఒకటి తలసరి ఆదాయం, రెండోది తలసరి విద్యుత్ వినియోగమని.. ఈ రెండింటిలో తెలంగాణ నంబర్ వన్ గా ఉందని అన్నారు.
75 సం.ల స్వాతంత్య్రం తర్వాత కూడా మన ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సిన పరిణితి రాలేదన్నారు కేసీఆర్. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని, ఫాల్తు వాగ్ధానాలు నమ్మొద్దని, కరీంనగర్ విజ్ణులు కాబట్టి ఆలోచించి ఓటేయ్యాలన్నారు. బీఆర్ఎస్ తరఫున కరీంనగర్ అభ్యర్థిగా గంగుల కమలాకర్ పోటీ చేస్తున్నారని, అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ నడవడిక, ఆలోచనా విధానం.. ఆ పార్టీ రాబోయే కాలంలో ఏం చేస్తుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. వజ్రాయుధం లాంటి ఓటును జాగ్రత్తగా వినియోగించాలని.. రాయి ఏదో రత్నమేదో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
అభ్యర్థులు గురించి ఆలోచించాలి, ఎమ్మెల్యేను గెలిపిస్తే ఏం చేశాడు? గుణగణాల గురించి ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ హక్కుల కోసమని రాష్ట్ర సాధన కోసమని అన్నారు. 50 సం ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఎంత నష్టపోయిందో అందరికీ తెలుసని అన్నారు. బీఆర్ఎస్ రాకముందు పదేళ్ల కాంగ్రెస్ పాలనలో తాగు సాగు నీరు లేదన్నారు. చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు జరిగాయన్నారు. ఆనాడు ఉన్న తెలంగాణను ఊడగొట్టి.. ఏపీలో కలిపారన్నారు. 1969 ఉద్యమ సమయంలో ఉద్యమకారులను పిట్టల్లా కాల్చి చంపారని , లక్షలమందిని అరెస్ట్ చేశారన్నారు.
వికలాంగులకు, వృద్ధులకు , వితంతవులకు, విధివంచితులకు పెన్షన్ ద్వారా కాపాడమని అన్నారు కేసీఆర్. వందల రూపాయల్లో పెన్షన్ ను వేల వరకూ చేర్చింది దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనన్నారు. గర్భవతులు, బాలింతల కోసం వైద్య వసతులు, అమ్మఒడి వాహనాలు.. కేసీఆర్ కిట్, అమ్మాయి పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే 12 వేలు ఇస్తున్నామన్నారు. ఆడపిల్ల పెళ్లి కోసం షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ పథకాలు ప్రవేశపెట్టామన్నారు. రైతాంగం బాగుండాలనే కొన్ని ప్రణాళికలు వేసుకున్నామని .. దేశంలోనే తొలిరాష్ట్రంగా కరెంట్ 24 గంటలు ఫ్రీ గా ఇస్తున్నామన్నారు. దేశంలోనే తొలిసారిగా పెట్టుబడి సాయంగా రైతు బంధు, రైతు బీమా గా రూ.5 లక్షలు అందిస్తున్నామన్నారు. కంటివెలుగు కార్యక్రమం ద్వారా రాష్ట్రమంతటా పరీక్షలు నిర్వహించామని, 80 లక్షల మందికి అద్దాలు పంచామన్నారు. సాగునీటిపై గతంలో పన్ను ఉండేది.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రద్దు చేశామన్నారు. ధరణి పోర్టల్ ద్వారా అద్భుత ఫలితాలు వచ్చాయని, ధరణి ద్వారా దళారులు లేకుండా పోయారన్నారు. ధరణి ఉండటం వల్ల రైతులు గడపదాటకుండా ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. పంజాబ్‌ను అధిగమించి ధాన్యం ఉత్పత్తిలో తెంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు కేసీఆర్. రాబోయే కొద్ది రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తోందని, అనుమానమే లేదన్నారు కేసీఆర్.