రూ.1000 కోట్లు మంజూరు చేశామంటే.. అదంతా సబిత పుణ్యమే: CM KCR

Byline :  Veerendra Prasad
Update: 2023-11-23 08:50 GMT

కాంగ్రెస్‌ పార్టీ మాటలు నమ్మి ప్రజలు ఓట్లేయవద్దని, వాళ్లను నమ్మి ఓటేస్తే కైలాసం ఆటల పెద్దపాము మింగిట్టైతదని సీఎం కేసీఆర్‌ చెప్పారు. మహేశ్వరంలో గురువారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఒకే ఒక్క అయుధమని, ఓటు వేసే ముందు అభ్యర్థల గుణగణాలు, పార్టీల చరిత్ర గమనించాలన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురించి చెబుతూ... ఆమె త‌న నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌ని చేశార‌ని, ఇలాంటి ఎమ్మెల్యేను ఇక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేదు అని కేసీఆర్ ప్ర‌శంసించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డికి మంత్రి అనే గ‌ర్వం లేదన్నారు. భూదేవీకి ఎంత ఓపిక‌ ఉంట‌దో స‌బిత‌కు అంత ఓపిక‌ ఉంటుందన్నారు.

స‌బిత పుణ్య‌మా అని బ‌డంగ్‌పేట్‌, జ‌ల్‌ప‌ల్లి, మీర్‌పేట‌, తుక్కుగూడ‌.. కాలనీల కోసం హైద‌రాబాద్ న‌గ‌రానికి 1000 కోట్లు మంజూరు చేసి నాలా డెల‌వ‌ప్‌మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నామని, దీంతో ఆ ప్రాంతాల్లో వరద నీటి ముంపు సమస్య పోయిందన్నారు. అక్కడి చెరువుల‌ను, నాలాల‌ను సుందరీక‌ర‌ణ చేసి అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. దీంతో పాటు కుత్బుల్లాపూర్, శేరిలింగంప‌ల్లి, రాజేంద్ర‌న‌గ‌ర్, మ‌హేశ్వ‌రం ప్రాంతాల్లో పైపు లైన్ వేయ‌మ‌ని, దాన్ని నివారించాల‌ని చెప్పి రూ. 670 కోట్ల‌తో శివారు న‌గ‌రాల‌కు మంచినీళ్లు తీసుకొచ్చి బాధ‌లు తీర్చామన్నారు. ఔట‌ర్ రింగ్ రోడ్డు చుట్టూ ప్ర‌త్యేక పైపు లైన్ వ‌స్తుందని, అది పూర్త‌యితే శాశ్వ‌తంగా మంచి నీటి బాధ‌లు తీరుతాయి అని కేసీఆర్ తెలిపారు. స‌బిత పోరాటంతోనే కందుకూరుకు మెడిక‌ల్ కాలేజీ వచ్చిందన్నారు. మెడిక‌ల్ కాలేజీకి అనుంబ‌ధంగా 500 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి రాబోతోందన్నారు.

ఓటు అనే వజ్రాయుధం మీ తలరాతను మారుస్తుందని, రాబోయే ఐదేళ్ల రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయిస్తుందన్నారు.బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని, ఉన్న తెలంగాణను ఉడగొట్టిందే కాంగ్రెస్ అని అన్నారు. 58 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని.. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనను గమనించాలని కోరారు. రైతుబంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్ , బీఆర్ఎస్ అని అన్నారు. భారతదేశంలో రైతుబంధు ఎక్కడా లేదని అన్నారు. దురదృష్ట వశాత్తూ.. ఎవరైనా రైతు చనిపోతే రూ.5లక్షలు కుటుంబానికి వారంలోగా అందుతున్నాయని... రైతులు పండించే ధాన్యంలో గింజకూడా లేకుండా రాష్ట్రంలో మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నది అని సీఎం అన్నారు. ధరణి తీసేసి భూమాత పెడతామని కాంగ్రెస్​ నేతలు చెబుతున్నారని.. వారు పెట్టేది భూమాత కాదు భూమేత అని ఎద్దేవా చేశారు. ధరణి తీసేస్తే రైతుబంధు, ధాన్యం డబ్బులు, రైతుబీమా ఎలా అందుతాయని ప్రశ్నించారు. ధరణిని తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

రైతులకు 24 గంటలపాటు నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. "కరెంటు వేస్ట్‌గా కేసీఆర్‌ 24గంటల కరెంటు ఇస్తున్నడు. 24 గంటలు అవసరం లేదు. మూడు గంటలు చాలు అంటున్నడు. మూడుగంటల కరెంటు సరిపోతుందా? 24 గంటల కరెంటు కావాలంటే సబితా ఇంద్రారెడ్డి గెలవాలి" అని అన్నారు. కాంగ్రెస్ అంటేనే దళారుల రాజ్యమని, కాంగ్రెస్ గెలిచాక కర్ణాటకలో ఏం జరుగుతుందో అందిరికీ తెలుసని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వస్తే కర్ణాటక పరిస్థితులేనన్నారు.




Tags:    

Similar News