TS Assembly Elections 2023 : నేడు కాంగ్రెస్‌ సీఈసీ సమావేశం.. రెండో జాబితా ఎప్పుడంటే..??

Byline :  Veerendra Prasad
Update: 2023-10-25 02:32 GMT

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తొలి విడతలో 55 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. రెండో(తుది) జాబితా విడుదలకు సిద్ధమైంది. అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేసేందుకు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) నేడు సమావేశం కానుంది. మొత్తం 119 సీట్లలో నాలుగు సీట్లను వామపక్షాలకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 55 మందిని ప్రకటించగా.. మిగిలిన 60 సీట్లలో అభ్యర్థులను నేటి సమావేశంలో ఖరారు చేయనున్నారు.

తొలి జాబితాలో సీనియర్లకు చోటు దక్కలేదు. ఆ జాబితాలో సీటు దక్కని వారిలో సీనియర్‌ నేతలు మధుయాష్కీ, షబ్బీర్‌ అలీ, మహే్‌షకుమార్‌గౌడ్‌, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉన్నారు. వీరిలో కొందరు తమకు సీటు దక్కుతుందా లేదా అన్న ఆందోళనలోనూ ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో తుది విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయనుంది. గురువారం అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. తుది జాబితా కూర్పు మాత్రం స్క్రీనింగ్‌ కమిటీకి సవాలే అంటున్నారు రాజకీయ నిపుణులు. ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గాన్ని తమకు కేటాయించాలని సీపీఎం పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో వామపక్షాలకు సీట్ల కేటాయింపుపైనా ఈ సమావేశం అనంతరం స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

ఇటు బీసీలు, అటు వివిధ సామాజిక వర్గాల వారు సీట్లలో తమ వాటా తేల్చాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకోవడం కత్తి మీద సాము అయ్యేలా ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. అలాగే రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు బుధవారం అగ్ర నేతల సమక్షంలో హస్తం గూటికి చేరనున్నట్లు తెలిసింది. కొత్తగా చేరేవారికి నాలుగైదు స్థానాలు కేటాయించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా స్థానాలను ఆశిస్తున్న ఆశావహులు దిల్లీకి చేరుకుని అగ్ర నేతలతో చర్చలు జరిపినట్టు తెలిసింది.




Tags:    

Similar News