Minister Harish Rao : ఎన్నికల్లో రూ.1,500 కోట్లు ఖర్చు.. ఇదే కాంగ్రెస్ ప్లాన్: మంత్రి హరీశ్ రావు

Byline :  Veerendra Prasad
Update: 2023-10-13 07:40 GMT

 ఎన్నికల్లో డబ్బులు పంచి గెలిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని రాష్ట్ర  (Minister Harish Rao) మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బెంగళూరు నగరంలో జరిగిన ఐటి దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయని, అక్రమంగా సంపాదించినటువంటి రూ.42 కోట్ల అవినీతి సొమ్మును తెలంగాణకు బదిలీ చేసే ప్రయత్నం చేసిందన్నారు. మెదక్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి హరీశ్ రావు... కర్ణాటక అవినీతి సొమ్మును రాష్ట్రానికి తరలించడంలో కొంతమంది బిల్డర్స్‌ ప్రధాన పాత్ర వహిస్తున్నారని వెల్లడించారు.

కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న అంబికాపతి ఆరోజుల్లో 40 శాతం కమిషన్ పని చేసేవారు. నేడు అదే అంబికా పతి 50% కమిషన్ వసూలు చేసి తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. అంబికాపతి సతీమణి అశ్వత్తమ గతంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అని గుర్తు చేశారు. వారిద్దరూ ఇంట్లో వుండగానే ఐటి దాడులు జరిగాయని.. ఐటీ దాడుల్లో రూ. 42 కోట్ల నగదు దొరికాయని తెలిపారు. ఆ డబ్బును తెలంగాణకు తరలించేందుకు కాంట్రాక్టర్‌ల నుంచి వసూలు చేసిన డబ్బు అని తెలుస్తుందని చెప్పారు. అంబికాపతి డీకే శివ కుమార్ కు అత్యంత సన్నిహితుడు అని తెలుస్తున్నదని.. కాంగ్రెస్ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

“కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన సంపాదన దొడ్డిదారిలో తెలంగాణకు చేరవేస్తున్నారు. బెంగళూరు నుంచి రూ.1,500 కోట్లు హైదరాబాద్‌ తరలించేందుకు యత్నించింది కాంగ్రెస్. ఇప్పటికే కొంత డబ్బు చెన్నైకు, హైదరాబాద్‌కు చేరిందని తెలుస్తోంది. నగదు తరలింపులో బిల్డర్లు, గుత్తేదారుల పాత్ర ఉంది. బిల్డర్లు, గుత్తేదారులు వ్యాపారం చేసుకోవాలి.. రాజకీయాల్లో జోక్యం వద్దు. కాంగ్రెస్ పార్టీ.. డబ్బులు ఉన్నవాళ్లకే టికెట్ ఇస్తుంది. ఆ పార్టీలో ప్రజాస్వామ్యానికి ప్రజలకు గౌరవం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణ వస్తున్నాయి. అభ్యర్థి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కాంగ్రెస్​కు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.” అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని కట్టలు పంచినా.. గెలుపు బీఆర్​ఎస్​దే అని, కాంగ్రెస్ డబ్బుకు ప్రాధాన్యం తప్ప, ప్రజల గురించి ఆలోచన లేదన్నారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్ ను ఎన్నటికీ సహించదని.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు తగిన గుణపాఠం తప్పదన్నారు.

Full View

Tags:    

Similar News