Komatireddy Rajagopal Reddy : 'లాస్ట్ మినిట్'లో నామినేషన్.. పరుగులు తీసిన కోమటిరెడ్డి
Thumb: వేరే అభ్యర్థి ప్రచారానికి వెళ్లి.. స్వకార్యానికి ఆలస్యమై..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంది. దీంతో నేడు భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు రోజుల్లో మొత్తం 2,747 నామినేషన్లు దాఖలయ్యాయి. మంచి ముహూర్తం ఉండడంతో నిన్న(గురువారం) ఒక్క రోజే 1,129 దాఖలయ్యాయి.
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం చివరి నిమిషంలో నామినేషన్ దాఖలు చేశారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. నిన్న నామినేషన్ వేసేందుకు చండూరులోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి గురువారం పరుగు తీశారు. అంతకుముందు నకిరేకల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి రాజగోపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా వెళ్లారు. అది పూర్తయ్యాక చండూరులో తాను నామినేషన్ వేయడానికి కారులో బయలుదేరారు. ఆయన ఇక్కడికి చేరుకునేటప్పటికి మధ్యాహ్నం 2.59 నిమిషాలు అయింది. కేవలం ఒక్క నిమిషం మాత్రమే గడువు మిగిలింది. 100 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ఆయన కారును నిలిపేసి పరిగెత్తుకుంటూ రిటర్నింగ్ అధికారి కార్యాలయం లోపలికి చేరుకున్నారు. ఆయనను అనుసరిస్తూ గన్‌మెన్, స్థానిక కాంగ్రెస్ నాయకుడు దోటి వెంకటేశ్ పరుగుతీశారు. అప్పటికే అభ్యర్థి సోదరుడు కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి, మర్రిగూడ మాజీ జడ్పీటీసీ సభ్యుడు మేదరి యాదయ్య లోపల వేచి చూస్తున్నారు. చివరి క్షణంలోనైనా అభ్యర్థి చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ఎన్నికల అఫిడవిట్‌లో తన పేరిట ఎలాంటి వాహనాలు లేవని పేర్కొన్నారు కోమటిరెడ్డి. ఆస్తుల విలువ రూ.405 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో చరాస్తుల విలువ రూ.297,36,37,347.. స్థిరాస్తి విలువ రూ.108,23,40,000గా వెల్లడించారు. కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆస్తుల విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో రూ.4.27 కోట్లను ఆస్తులుగా పేర్కొన్న మంత్రి జగదీశ్ రెడ్డి నిలిచారు.