Lok Poll Survey : ఆ పార్టీకే అధికారం.. ప్రీపోల్ సర్వేలో ఏం చెప్పిందంటే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించిన బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదలకు సిద్ధమవుతోంది. మిగతా పార్టీలన్నీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశముంది. మరో నెలా నెలన్నరలో ఎన్నికలు ఉండటంతో రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది. ఈ క్రమంలో కొన్ని సంస్థలు పార్టీల బలాబలాలపై ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో జనం ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారన్న సర్వేలు నిర్వహించారు.
తాజాగా లోక్ పోల్ సంస్థ తెలంగాణ ఓటర్ల నాడి తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా ఈసారి ఏ పార్టీకి ఓటేస్తారన్న అంశంపై రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 60వేల మందిపై సర్వే నిర్వహించింది. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఒక్కో నియోజకవర్గంలో 500 మందిపై సర్వే నిర్వహించింది. ప్రతి నియోజకవర్గంలోని 30 పోలింగ్ బూత్ లను ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి సర్వే నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా 60 వేల మంది అభిప్రాయాలు సేకరించిన లోక్ పోల్ సంస్థ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశముందని చెప్పింది. ఈసారి ఆ పార్టీ 61 నుంచి 67 స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పింది. కాంగ్రెస్కు 41 నుంచి 44శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశముందని స్పష్టంచేసింది. ఇక అధికార బీఆర్ఎస్ 39 నుంచి 42శాతం ఓట్ షేర్ తో 45 నుంచి 51 సీట్లకు పరిమితమవుతుందని ప్రకటించింది. ఎంఐఎం 6 నుంచి 8 (3 -4%), బీజేపీ 2 నుంచి 3 (10 - 13% ఓట్ షేర్) స్థానాలు, ఇతరులు ఒక్క సీటులో విజయం సాధిస్తారని లోక్ పల్స్ స్పష్టం చేసింది.
మెదక్, నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పట్టు కొనసాగుతుందని.. మిగతా చోట్ల మాత్రం ప్రభావం తగ్గుతుందని లోక్ పల్స్ చెప్పింది. కాంగ్రెస్ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా బలం పుంజుకుందని స్పష్టం చేసింది. మైనార్టీలతో పాటు బీసీలు కాంగ్రెస్ వెంట నడిచేందుకు మొగ్గుచూపుతున్నట్లు సర్వేలో తేలింది. ఖమ్మం,మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, జహీరాబాద్ లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పింది.