TS Assembly Elections 2023 : నేను సీఎం అవుతా.. ఎన్నికల వేళ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Byline :  Veerendra Prasad
Update: 2023-10-24 02:12 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదేళ్లలో తాను సీఎం అవుతానని వ్యాఖ్యానించారు. సంగారెడ్డిలో జరిగిన దసరా వేడుకల్లో జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే 10 ఏళ్లల్లో తాను తెలంగాణకు సీఎం అవుతానని అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తున్నాయి.కాంగ్రెస్‌లో ఇప్పటికే సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. దాదాపు సీనియర్ నేతలందరూ సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారు. కాంగ్రెస్ గెలిస్తే తామే సీఎం అభ్యర్థి అంటూ ముఖ్యనేతలందరూ ప్రకటించుకుంటున్నారు. కాంగ్రెస్ గెలిస్తే తానే సీఎం అవుతానంటూ ఇటీవల మాజీ మంత్రి జానారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం పదవి చేపట్టే అవకాశం వస్తే వదులుకోనని, పార్టీకి ఎన్నో సేవలు అందించానని అన్నారు. తాను సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కార్యకర్తల సమావేశంలో జానారెడ్డి తెలిపారు. జానారెడ్డి వ్యాఖ్యలు పార్టీలో సంచలనం రేపిన క్రమంలో.. ఇప్పుడు జగ్గారెడ్డి కూడా అదే బాటలో నడవడం గమనార్హం.

విజయదశమి నాడు నా మనసులో మాట చెబుతున్నానంటూ.. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని.. దీన్ని ఎవరైనా కాదనగలరా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొన్ని విషయాలు బయటకు చెప్పలేకపోతున్నానని, లేకపోతే చాలా విషయాలు పంచుకునేవాడినని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తినని చెప్పారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని అన్నారు. నియోజకవర్గంలో తాను అందుబాటులో లేక పోయినా తన భార్యతో పాటు అనుచరులు ఉంటారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు.



 


Tags:    

Similar News