PAC Meeting: గాంధీభవన్‌లో నేడు కాంగ్రెస్ పీఏసీ సమావేశం.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ!
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతో సహా ముఖ్యనేతలంతా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల సన్నాహాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది. అలాగే కొన్ని రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతోపాటు ఓడిపోయిన చోట్ల జరిగిన తప్పులపైనా సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడినందున నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ టికెట్లపై పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే వీటి కోసం అనేక రకాలుగా పైరవీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గెలుపోటములు బేరీజుగా వేసుకొని, ప్రాధాన్యాల ఆధారంగా దశలవారీగా ఆ పదవులను భర్తీ చేయాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 50కిపైగా నామినేటెడ్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. వీటిని దశలవారీగా ప్రాధాన్యతల ఆధారంగా భర్తీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. అదనంగా దాదాపు ఆరు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీ కావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రయోజనం కలిగేలా వీటిని వినియోగించుకోవాలని నాయకత్వం ఆలోచిస్తున్నది. ఆశావహులు ఎవరెవరు ఉన్నారు? గతంలో ఎవరికి ఎలాంటి హామీలు ఇచ్చారు? ఏ ప్రాతిపదికన పదవులు ఇవ్వాలి? వంటివి చర్చించే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఏడాది ఆరంభంలోనే జరగవచ్చనే ప్రచారం ఉంది. వచ్చే మార్చి, ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతంతోపాటు, క్షేత్రస్థాయిలో వ్యవహరించాల్సిన తీరుపై సమాలోచనలు చేస్తారని సమాచారం. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలపై విస్తృత స్థాయిలో చర్చించనున్నట్లు తెలియవచ్చింది. పార్టీ పథకాల అమలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా పథకాల అమలు, వాటి ప్రయోజనాలు ప్రజలకు చేరేలా పార్టీ నాయకులను సమాయత్తం చేయడం వంటి తదితర అంశాలపై పీఏసీ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.