TS Assembly Elections 2023 : తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతోంది - రాహుల్ గాంధీ
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పెద్దపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ సునామీలో ప్రత్యర్థులంతా కొట్టుకుపోతారని రాహుల్ అభిప్రాయపడ్డారు. స్వరాష్ట్రం ఏర్పడి పదేండ్లైనా కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. పదేండ్ల తర్వాత కూడా సోనియాగాంధీ స్వప్నం, ప్రజల కలను ముఖ్యమంత్రి నెరవేర్చలేకపోయరని విమర్శించారు.
డబుల్ బెడ్రూం ఇండ్లు ఎంత మందికి ఇచ్చారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఎంత మంది రైతులకు రూ. లక్ష రుణమాఫీ జరిగిందో చెప్పాలని అన్నారు. భూస్వాములు, ధనవంతులకు మేలు చేసేందుకే కేసీఆర్ రైతు బంధు తెచ్చారని విమర్శించారు. ధరణి పేరుతో వివరాలు కంప్యూటరైజ్ చేస్తున్నామని రైతుల భూములు లాక్కున్నారని రాహుల్ మండిపడ్డారు. దళితులకు మూడెకరాలు ఇస్తామన్న కేసీఆర్ ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం మొదలైందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఒకవైపు సీఎం, ఆయన కుటుంబ సభ్యులుంటే.. మరోవైపు ప్రజలు ఉన్నారని అన్నారు. ప్రభుత్వంలోని కీలకమైన శాఖలన్నీ కేసీఆర్ కుటుంబసభ్యుల ఆధీనంలో ఉన్నాయని రాహుల్ విమర్శించారు. కేసీార్ ముఖ్యమంత్రి తరహాలో కాకుండా రాజులాగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు.