Kunamneni Sambasiva Rao : పార్లమెంట్‌పై దాడికి బీజేపీనే కారణం..! MLA కూనంనేని

Byline :  Veerendra Prasad
Update: 2023-12-22 08:31 GMT

పార్లమెంట్ మీద దాడి జరగడం అంటే అంబేడ్కర్ గుండెపైన దాడి జరిగినట్టేనని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ దేశానికి పవిత్రమైన దేవాలయం లాంటి పార్లమెంట్ పై జరిగిన దాడి, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. పార్లమెంటులో విపక్ష ఎంపీల సస్పెన్షన్లను నిరసిస్తూ ‘ఇండియా’ కూటమిలోని పార్టీల నేతృత్వంలో దేశవ్యాప్తంగా ధర్నాలు కొనసాగుతున్నాయి. ఇండియా కూటమి పిలుపు మేరకు హైదరాబాద్లోనూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిరసన ప్రదర్శన జరుగుతోంది. ఈ ధర్నాలో పాల్గొన్న సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని.. అసలు దాడి ఎందుకు జరిగిందని, దాని వెనుకున్నదెవరని ప్రశ్నించిన 146 ఎంపీలను బయటికి పంపిచడం.. మోదీ, షా ల నిరంకుశ పాలనగా అర్థమవుతుందన్నారు. పాలకులుగా ఉన్న మోదీ, షా ల ద్వయం.. పరదేశ నియంతలైన హిట్లర్, ముస్సోలిని లా ప్రవర్తించారన్నారు. 146 మంది పార్లమెంట్ సభ్యులను ఏ కారణం చేత సస్పెండ్ చేశారని ప్రశ్నిస్తూ.. అహంభావంతో ప్రవర్తిస్తే మోదీ, అమిత్ షా లకు కూడా హిట్లర్, ముస్సోలినీల గతే పడుతుందన్నారు.

అసలు అగంతకులు పార్లమెంట్ లోకి చొరబడ్డారంటే.. అందుకు కారణమెవరు? వారికి పాస్‌లు ఇచ్చిందెవరు?.. ఓ బీజేపీ ఎంపీనే వారికి పాస్‌లు ఇవ్వడం చూస్తుంటే.. ఈ దాడికి బీజేపీనే కారణమని అనుమానించాల్సి వస్తుందన్నారు కూనంనేని. ఎన్నికలు సమీపిస్తున్నందున మీరే ఆ కుట్రకు పాల్పడి ఉంటారనే సందేహం కలుగుతుందన్నారు. ఆగంతకులకు పాస్ ఇచ్చిన బీజేపి ఎంపీని ఇంతవరకు ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఆనాడు రాహుల్ గాంధీ మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యలు చేసినందుకు .. పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేశారని, ప్రశ్నించినందుకు తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాను కూడా సస్పెండ్ చేశారని ఆరోపించారు. బీజేపీ తప్పుల్నీ ప్రజలంతా చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో పరాభావం తప్పదన్నారు.




Tags:    

Similar News