Kunamneni Sambasiva Rao : ఈ ప్రజాతీర్పు.. భవిష్యత్తుకు సంకేతం... కూనంనేని
కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా అధికారమే శాశ్వతం అనుకుంటే ఇటీవల వెల్లడైన ప్రజాతీర్పు భవిష్యత్తుకు సంకేతమన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఆ విషయం దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా వ్యహరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని గెలిచిన సీపీఐ నాయకుడు కూనంనేని.. మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. తమ(సీపీఐ)తో పొత్తు.. కాంగ్రెస్‌కు కలిసొచ్చిందన్నారు . కాంగ్రెస్, సీపీఐ పొందిక బాగా కలిసివచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించారని, కేసీఆర్ గొప్ప గొప్ప వాగ్ధానాలు ఇచ్చినా.. పదేళ్లుగా ఏం చేయలేని వ్యక్తి.. ఇప్పుడేమి చేస్తారనే బీఆర్ఎస్ ను ఓడించారన్నారు. కాంగ్రెస్ కు సుదీర్ఘ అనుభవం ఉందని, కేసీఆర్ కంటే ఉత్తమం అని భావించి తమకు ఓటేశారన్నారు. తమ గెలుపుకి టీడీపీ, సీపీఎం, టీజేఎస్ పార్టీలు మద్దతిచ్చాయన్నారు. కోల్‌బెల్ట్‌లో ప్రతీ ఒక్కరూ కాంగ్రెస్‌కే ఓటేశారన్నారు. కమ్యూనిస్టులు ఎటువైపుంటే తెలంగాణలో అధికారంలో ఉన్నవాళ్లకి అదొక అవకాశంగా చెప్పుకోవచ్చన్నారు. అసెంబ్లీలో ప్రశ్నించేవాడు, నిజాయితీ గలవాడు ఒక్కడైనా ఉండాలని కమ్యూనిస్టులు , లెఫ్ట్ పార్టీలు భావించాయని అందువల్లే తన గెలుపు సాధ్యమైందని అన్నారు.