Bhatti Vikramarka : పార్లమెంటునే రక్షించలేనోళ్లు దేశాన్ని ఎట్లా కాపాడుతారు - డిప్యూటీ సీఎం భట్టి
దేశంలో ప్రజాస్వామ్యంపై పెత్త ఎత్తున దాడి జరుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇండియా కూటమి పిలుపు మేరకు ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే భారత పార్లమెంటుపై దాడి జరిగితే ప్రధాని మోడీ,హోంమంత్రి అమిత్ షా ఒక్క మాట మాట్లాడకపోవడాన్ని భట్టి తప్పు బట్టారు. పార్లమెంటుపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడి జరిగినట్లేనని అన్నారు. దాడికి సంబంధించి సభలో వివరణ ఇవ్వాలన్న 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం సరికాదని భట్టి అభిప్రాయపడ్డారు.
దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు జరగలేదని భట్టి అన్నారు. దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదని, ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. పొగ బాంబులు వేసిన నిందితులు వేరే విధంగా దాడి చేసి ఉంటే ప్రపంచ దేశాల ముందు భారత్ చులకనయ్యేది కదా అని అన్నారు. పార్లమెంటును రక్షించలేని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ఎలా రక్షించగలదని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బోర్డర్ లో అలజడి సృష్టించడం మినహా మోడీ సర్కారు చేసిందేమీలేదని భట్టి విమర్శించారు.