TS Elections 2023: నేడే ఎన్నికల నోటిఫికేషన్.. నామినేషన్ల స్వీకరణ

By :  Lenin
Update: 2023-11-03 02:05 GMT


ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి వేళ అయింది. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా నేటి (శుక్రవారం) నుంచి మొదలు కానుంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 9న ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. శుక్రవారం నాడు నోటిఫికేషన్‌కు గవర్నర్ తమిళిసై ఆమోదంతో గెజిట్‌ నోటిఫికేషన్ జారీ చేస్తారు. నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత ఆ వెంటనే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. నేటి నుంచి వారంపాటు నామనేషన్లను స్వీకరిస్తారు.




 



ఈ రోజు (నవంబరు 3) నుంచి 10వ తేదీ వరకు ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రిటర్నింగ్‌ అధికారులను నియమించారు. సెలవు రోజులు మినహా అన్ని పని దినాల్లో అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించవచ్చు. నవంబరు 13వ తేదీ వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 15 చివరి తేదీగా నిర్ణయించారు. ఈనెల 30న పొలింగ్‌ నిర్వహించి వచ్చేనెల 3న ఓట్లలెక్కింపు చేపడతారు. డిసెంబర్ 5లోపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.




 



నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని ఈసీ స్పష్టం చేసింది. అభ్యర్థులు సువిధ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనూ.. నామినేషన్లను సమర్పించవచ్చన్న ఎన్నికల సంఘం... వాటికి సంబంధించిన హార్డ్‌ కాపీపై సంతంకం చేసి నిర్ధిష్ట గడువులోగా రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజకవర్గం నుంచి గరిష్ఠంగా 4 సెట్ల నామినేషన్లు వేయవచ్చు. ఒక అభ్యర్థి 2 కు మించి నియోజకవర్గాల్లో పోటీ చేయరాదు. నామినేషన్ల దాఖలులో.. RO, ARO కార్యాలయం సమీపంలోని 100 మీటర్ల పరిధిలోకి గరిష్ఠంగా 3 వాహనాలనే అనుమతిస్తారు. నామినేషన్ ప్రక్రియ, కార్యాలయం వెలుపల వీడియో, సీసీటీవీ ద్వారా రికార్డు చేస్తారు. అభ్యర్థితోపాటు ఐదుగురిని మాత్రమే ఆర్‌ఓ గదిలోకి అనుమతిస్తారు. అభ్యర్థులు నామినేషన్‌తోపాటు తన నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హత వివరాలను తెలియజేస్తూ ఫారం-26లో అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఈసీఐ సూచించింది. విదేశీ ఓటర్లు అక్కడి నుంచే నామినేషన్ దాఖలు చేస్తే అక్కడి రాయబార కార్యాలయాలు, కాన్సుల్ కార్యాలయాల్లో ప్రమాణం చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News