Election Commission : 5 రాష్ట్రాల్లో అమల్లోకి ఎన్నికల కోడ్.. అధికార పార్టీ ఏం చేయకూడదంటే..?
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. తెలంగాణతో పాటు మిజోరాం, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. దీంతో ఈ రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ రావడంతో ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. అదేవిధంగా కొత్త పథకాలు ప్రకటించడానికి వీలు లేకుండా పోయింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
1. ప్రజాప్రతినిధులు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు. పార్టీ పనులకు పాలన యంత్రాగాన్ని వినియోగించుకోకూడదు.
2. అధికార పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు రెండూ కలిపి చేయకూడదు.
3. సీఎంతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు హెలికాప్టర్‌తోపాటు ఇతర ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు. ఇంటి నుంచి కార్యాలయానికి, కార్యాలయం నుంచి ఇంటికి తప్ప మరే ఇతర పనులకు ప్రభుత్వ వాహనాలను వాడకూడదు.
4. సెక్యూరిటీ వాహనాల్లోనూ మూడు కంటే ఎక్కువ వాడితే దాన్ని ఎన్నికల వ్యయం కింద సంబంధిత పార్టీ చూపించాలి.
5. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తుంది.
6. ప్రభుత్వ వసతి గృహాలు, సభాస్థలిలు, హెలిప్యాడ్‌లు వంటి సౌకర్యాలను కేవలం అధికారపార్టీ వారికే పరిమితం చేయడకుండా ఇతర పార్టీలకూ అవకాశం కల్పించాలి.
7. పేపర్లు, టీవీల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచార ప్రకటనలు ఇవ్వకూడదు.
8. టీవీల్లో ప్రకటనలు ఇచ్చే ముందు దానికి సంబంధించిన సీడీని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీకి చూపించి.. అనుమతి తీసుకోవాలి.
9. ఎన్నికల నియమావళి వెలువడ్డాక ఎలాంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయకూడదు.
10. కొత్త పథకాలు ప్రకటించకూడదు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయకూడదు. రోడ్ల నిర్మాణం, తాగునీటి వసతులపై హామీలు ఇవ్వకూడదు.