TS Assembly Elections 2023 : ఎల్బీనగర్ బరిలో 48 మంది.. ఒక్కో బూత్లో ఎన్ని బ్యాలెట్ యూనిట్లంటే..?

Byline :  Kiran
Update: 2023-11-16 16:31 GMT

అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లలో నిమగ్నమైంది. అభ్యర్థులకు గుర్తులు కేటాయించిన వెంటనే బ్యాలెట్ యూనిట్లు రెడీ చేసే పనిలో నిమగ్నం కానుంది. ఇదిలా ఉంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో 48 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో ఈసీ ఆ నియోజకవర్గ పోలింగ్ స్టేషన్లలో 4 చొప్పున బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించనున్నారు.

ఈవీఎంలలో వినియోగించే బ్యాలెట్ యూనిట్లో గరిష్టంగా 16 మంది అభ్యర్థుల పేర్లు గుర్తు చేర్చే అవకాశముంది. ఈ లెక్కన చూస్తే ఎల్బీనగర్ లో 48 మంది అభ్యర్థులు ఉన్నందున మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతాయి. అయితే నోటా ఆప్షన్ కూడా ఉన్నందున అదనంగా మరో బ్యాలెట్ యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో నాలుగు యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే నాలుగు యూనిట్లలో తాము ఓటేయాలనుకునే అభ్యర్థిని గుర్తించడం ఓటర్లకు పెద్ద సవాల్గానే మారనుంది.

రాష్ట్రంలో 15 అంతకన్నా తక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గాలు 54 ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో నోటాతో కలిపితే 16 పేర్లు బ్యాలెట్‌లో ఉంటాయి. దీంతో అక్కడ ఒకే బ్యాలెట్‌ యూనిట్‌ అవసరమవుతుంది. 16 నుంచి 31 మంది లోపు అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గాలు 55 ఉన్నాయి. ఇక్కడ ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో రెండు చొప్పున బ్యాలెట్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. 32 నుంచి 47 లోపు అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల సంఖ్య తొమ్మిది. ఆ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 3 చొప్పున బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించనున్నారు.




Tags:    

Similar News