Etela Rajender:అధిష్ఠానం ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా : ఈటల
హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. ఎంపీగా పోటీ చేస్తానంటున్నారు. తమ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు ఈ బీజేపీ నేత. హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ప్రజల ఆశీర్వాదంతో ముందుకు వెళ్తానని... పోటీ చేయాలా వద్దా, ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని తెలిపారు. వ్యక్తుల పట్ల పార్టీ దగ్గర అపారమైన సమాచారం ఉంటుందన్నారు.
2021 ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పగబట్టారని ఈటల ఆరోపించారు. ఎమ్మెల్యే హక్కులను హరించారని మండిపడ్డారు. గెలిచిన ఎమ్మెల్యే బాధ్యతలను నిర్వర్తించకుండా అడ్డుకున్నారన్నారు. జిల్లా నుంచి నియోజకవర్గ స్థాయి అధికారులకు ఆంక్షలు విధించారని ఆరోపించారు. నాడు కల్యాణలక్ష్మి చెక్కులపై సంతకాలు చేసేది తానైతే.. పంపిణీ చేసేది బీఆర్ఎస్వాళ్లని చెప్పుకొచ్చారు. ఎక్కడ కూడా.. అధికారికమైన కార్యక్రమాలను నిర్వహించలేకపోయామని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అప్పటి ప్రభుత్వం పగబట్టిందన్నారు. ప్రజాస్వామ్య వ్వవస్థలో ఇంతటి చీకటి పరిపాలన చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఈటల విమర్శించారు.
మరోవైపు... హుజూరాబాద్‌లో ఓటమిపాలు అవ్వడంతో ఈటలను పార్టీ పట్టించుకోవడం లేదన్నట్టు టాక్ వినిపిస్తోంది. బిజెపిలో ఆయనను ఎవరూ పట్టించుకోవడంలేదని, దీంతో ఈటెల ఏం చేయాలో అర్థం కాక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని కొందరు అంటున్నారు.