బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలంతా.. తమ పార్టీ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ను ఎన్నుకున్నారు. శాసనసభా పక్షనేతగా తానే ఉంటానని కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ.. ప్రతిపక్ష హోదాను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కేసీఆర్ బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నికైనా.. ఇప్పట్లో అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు. నిన్న జరిగిన శస్త్రచికిత్స కారణంగా ఆయన కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు సమయం పట్టొచ్చని డాక్టర్లు సూచించారు.
దాంతో కేసీఆర్ ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేయట్లేదు. మిగిలిన ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగా అసెంబ్లీ సమావేశంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా.. బస్సులో అసెంబ్లీకి బయలుదేరారు. తెలంగాణ భవన్ నుంచి గన్‌పార్క్‌కు చేరుకుని.. అమరులకు నివాళులు అర్పించి తర్వాత అసెంబ్లీకి హాజరుకానున్నారు.